
నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను కృష్ణా రివర్ బోర్డ్ వెనక్కి పంపింది. ఏపీ భద్రతా బలగాల విషయంలో హైడ్రామా జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల వెనక్కి పిలిచి మళ్లీ వారిని కేంద్రం కొనసాగిస్తోంది.
ప్రస్తుతం వైజాగ్కి చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధీనంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత ఉంది. ఈరోజు(మంగళవారం, ఏప్రిల్ 8) సాయంత్రం వరకు తెలంగాణ డ్యామ్ సెక్యూరిటీగా ఉన్న ములుగు జిల్లా సీఆర్పీఎఫ్ బెటాలియన్ టీమ్.. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టును 2023 డిసెంబర్లో సీఆర్పీఎఫ్ తన ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతిలో పెట్టాలన్న ప్రతిపాదనకు తెలంగాణ, ఏపీ అంగీకరించినప్పటి నుంచి డ్యామ్ దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రోజు నాగార్జున సాగర్పై హైడ్రామా చోటు చేసుకున్న ఘటన గుర్తుండే ఉంటుంది. తాగు అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉండగా తెలంగాణ తాత్సారం చేస్తోందంటూ 700 మంది ఏపీ పోలీసులు డ్యాంపైకి వచ్చారు. 13వ నంబర్ గేటు వద్ద ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేసుకున్నారు.
రెండు రాష్ట్రాలకు చెందిన వందల సంఖ్యలో పోలీసులు సాగర్ డ్యాంపై మోహరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ అధికారులు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చెయ్యడానికి ప్రయత్నించారు. దీన్ని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఏపీ అధికారులు ఆ సందర్భంలో నీటిని విడుదల చేసుకున్నారు.