గొడం నగేశ్ నామినేషన్‌పై గందరగోళం

ఆదిలాబాద్, వెలుగు: నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా శుక్రవారం ఎన్నికల అధికారులు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి గొడం నగేశ్ నామినేషన్ లోని 26 కాలమ్ లో వివరాలు నమోదు చేయకుండా ఖాళీగా ఉంచడంతో ఆయన నామినేషన్ పై గందరగోళం నెలకొంది. ఎన్నికల నియామావళికి అనుగుణంగా నగేశ్ నామినేషన్ దాఖలు చేయలేదని, దీంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించాలంటూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, నేతలు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్​రాజర్షి షాకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ తన కుటుంబసభ్యులు, ఆస్తుల వివరాలు పొందుపర్చకుండా ఆ కాలమ్​ను ఖాళీగా ఉంచారని పేర్కొన్నారు. 

ఎన్నిక‌ల అధికారులు స్పందించి వెంట‌నే ఆయ‌న నామినేషన్​పత్రాలను తిరస్కరించాలన్నారు. అధికారులు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ్యవహరించాలని, ఏ రాజ‌కీయ‌ పార్టీల‌కు అనుకూలంగా ఉండ‌కూడ‌ద‌న్నారు. అవ‌స‌ర‌మైతే ఈ విష‌యంలో న్యాయ పోరాటం చేయ‌డానికి సైతం సిద్ధమని స్పష్టం చేశారు. బోథ్ అసెంబ్లీ ఇన్​చార్జి ఆడే గ‌జేంద‌ర్‌, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, త‌ల‌మ‌డుగు, జైన‌థ్‌ జ‌డ్పీటీసీలు గోక వెంకట్‌రెడ్డి, అరుంధ‌తి వెంక‌ట్ రెడ్డి, మున్సిప‌ల్ వైస్ చైర్మెన్ జ‌హీర్ రంజాని పాల్గొన్నారు.