ఇంటర్ ప్రాక్టికల్స్​పై అయోమయం..విడుదల కానీ పూర్తిస్థాయి షెడ్యూల్

ఇంటర్ ప్రాక్టికల్స్​పై అయోమయం..విడుదల కానీ పూర్తిస్థాయి షెడ్యూల్
  • రాష్ట్రవ్యాప్తంగా 3 నుంచి ఎగ్జామ్స్ 
  • ఇప్పటికీ విడుదల కానీ పూర్తిస్థాయి షెడ్యూల్
  • హాల్ టికెట్లు అందక  ఆందోళనలో స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 3నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ పై అయోమయం నెలకొన్నది. అకాడమిక్ షెడ్యూల్ ప్రకారం మరో రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కంప్లీట్ కాలేదు. 

పూర్తి స్థాయి షెడ్యూల్​తో పాటు స్టూడెంట్లకు హాల్ టికెట్లూ ఇవ్వలేదు. దీనికి ప్రైవేటు కాలేజీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సమస్యనే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. దీంతో స్టూడెంట్లు, పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్ ఉంటాయని పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ సమయంలో బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ పూర్తిస్థాయి షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు అధికారులు రిలీజ్ చేయలేదు. 

దీనికితోడు హాల్ టికెట్లూ ఇష్యూ చేయలేదు. ప్రతి ఏడాది కనీసం వారం రోజుల ముందే ఫేజ్ ల వివరాలతో పాటు హాల్ టికెట్లు రిలీజ్ చేసేవాళ్లు. కానీ, ఈసారి అది అమలు కాలేదు. ఏటా సుమారు మూడున్నర లక్షల మంది ప్రాక్టికల్స్ కు అటెండ్ అవుతారు. 

వీరికి నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ డేటా ఆధారంగా కాలేజీల మేనేజ్​మెంట్లు స్టూడెంట్లకు హాల్ టికెట్లు ఇస్తూ.. బ్యాచుల వారీగా వివరాలు చెప్పేవారు. ప్రైవేటు కాలేజీల్లో స్టూడెంట్ల నుంచి కాలేజీ ఫీజులూ వసూలు చేసేవారు. 

ప్రస్తుతం ఇప్పటికీ హాల్ టికెట్లు రాకపోవడంతో వారిలోనూ ఆందోళన మొదలైంది. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లనూ ఇంటర్ బోర్డు నియమించలేదు.

‘ప్రైవేటు’లో సీసీ కెమెరాలు లేనట్టే..!

ప్రైవేటు కాలేజీల్లోని ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు పెట్టాలనే ఇంటర్ బోర్డు నిబంధనను మేనేజ్​మెంట్లు వ్యతిరేకించాయి. ఈ నిబంధన అమలు చేయాలని ఒత్తిడి చేస్తే.. ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వబోమని హెచ్చరించాయి. 

మేనేజ్​మెంట్లు వెనక్కి తగ్గకపోవడంతో చేసేదేమీ లేక.. ఇంటర్ బోర్డు అధికారులే వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని తీసుకోవాలని డీఐఈవోలు, నోడల్ ఆఫీసర్లు శుక్రవారం రాత్రి కాలేజీలన్నింటికీ సమాచారం ఇచ్చారు.