కాళేశ్వరంపై గందరగోళం.. నీళ్లు ఎత్తిపోయాల్నా.. వద్దా?

కాళేశ్వరంపై గందరగోళం.. నీళ్లు ఎత్తిపోయాల్నా.. వద్దా?
  • కాళేశ్వరంపై గందరగోళం
  • నీళ్లు ఎత్తిపోయాల్నా.. వద్దా? అని సర్కారు డైలమా
  • ముందే లిఫ్ట్ చేస్తే వానల వల్ల కిందికి వదులుడే
  • ఆగుదామంటే చివర్లో ఎత్తిపోసేందుకు నీళ్లుంటలేవ్​
  • జూన్‌‌ 16న మోటార్లను స్టార్ట్ చేసిన్రు.. 
  • హైదరాబాద్​ నుంచి ఆర్డర్స్​తో ​20 రోజులకే బంద్​ పెట్టిన్రు 
  • 33 టీఎంసీలను అక్కడిన్ని ఇక్కడిన్ని ఎత్తిపోసి ఊకున్నరు
  • ఆరు రోజులుగా మేడిగడ్డ గేట్లు ఖుల్లా.. నీళ్లు సముద్రంపాలు
  • మల్లన్నసాగర్​ పూర్తి కాక ఎక్కడ నిల్వచేయాల్నో సమజైతలే

జయశంకర్‌ భూపాలపల్లి/ నెట్​వర్క్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసే విషయంలో రాష్ట్ర సర్కారు గందరగోళానికి గురవుతోంది. ముందుగా నీళ్లు ఎత్తిపోశాక ఒకవేళ వర్షాలు పడితే అప్పటిదాకా లిఫ్టు చేసిన వాటర్​ను కిందికి వదిలేయాల్సి వస్తోంది. అలా చేస్తే కోట్ల రూపాయల కరెంట్​ ఖర్చులు మీదపడుతున్నాయి. పోనీ, లిఫ్ట్‌‌ చేయకుండా వెయిట్​ చేద్దామంటే చివర్లో ఎత్తిపోసేందుకు నీళ్లు ఉండట్లేదు. గడిచిన రెండేండ్లలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్​లో  తీవ్ర తర్జనభర్జనల నడుమ జూన్‌‌ 16న మోటార్లు స్టార్ట్ చేసినా 20 రోజులపాటు నడిపి కేవలం 33 టీఎంసీలు ఎత్తిపోశాక బంద్​పెట్టారు. ఎల్లంపల్లి, మిడ్​మానేర్​, ఎల్​ఎండీ లాంటి కీలక ప్రాజెక్టుల్లో ఇప్పటికే నీళ్లుండడం, మల్లన్న సాగర్ పూర్తి కాకపోవడంతో నీటిని ఎక్కడ నిల్వచేయాల్నో తెలియక అక్కడిన్ని ఇక్కడిన్ని పోసినట్లు చేసి ప్రస్తుతానికి మమ అనిపించారు. ఏకధాటిగా 200 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోయాల్సిన పంపులు 33 టీఎంసీలకే  రెస్ట్​ తీసుకుంటుంటే, ఆరు రోజులుగా మేడిగడ్డ నుంచి 12 గేట్ల ద్వారా 10,380 క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంవైపు వెళ్లిపోతున్నాయి.

రెండేండ్లలో 2 వేల కోట్ల కరెంట్​ బిల్లులు కడితే..! 
కాళేశ్వరం ‌నుంచి వానాకాలం ప్రారంభంలో నీటిని లిఫ్ట్ చేశాక వర్షాలు పడితే మళ్లీ గేట్లను తెరిచి కిందికి వదలాల్సి వస్తోంది. 2019‒20లో 60 టీఎంసీలు, 2020‒21లో 33 టీఎంసీలు లిఫ్టు చేసినా అదనంగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేకపోయారు. మొదటి ఏడాది 2019 జూన్ 21 నుంచి 2020 మే 30 వరకు దశలవారీగా 60 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి లిఫ్టు చేయగా.. మధ్యలో ఆగస్టు, సెప్టెంబర్​లో భారీవర్షాల కారణంగా ఎత్తిపోసిన నీళ్లన్నింటినీ కిందికి వదిలేశారు. ప్రాజెక్టులన్నీ వర్షాలకే నిండడంతో కాళేశ్వరం పంపులన్నీ బంద్​పెట్టి ఖాళీగా కూర్చున్నారు. తర్వాత 2021 జనవరి 17న మేడిగడ్డలో 17 మోటార్లకుగాను కేవలం ఏడు మోటార్లు స్టార్ట్ చేసి, మార్చి 9 దాకా నడిపారు. మొత్తం 33 టీఎంసీలను లిఫ్ట్ చేసేసరికి మేడిగడ్డలో నీటిమట్టం 1.26 టీఎంసీలకు, ప్రాణహిత ప్రవాహం వెయ్యి క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో పంపులను బంద్​పెట్టారు. రెండేండ్లలో రూ. 2 వేల కోట్లకు పైగా కరెంట్ బిల్లులు కట్టి లిఫ్టు చేసింది 93 టీఎంసీలు కాగా,  2వేల టీఎంసీలకు పైగా నీళ్లను సముద్రంలోకి వదిలేశారు. 2019-–20లో ఎత్తిపోసిన నీళ్లన్నీ కిందికిపోగా, 2021 లో మార్చి నాటికి ఎత్తిపోద్దామంటే నీళ్లే లేకుండా పోయాయి. అందుకే ఈసారి లిఫ్టులను నడిపే విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్​కు గురవుతోంది. పలు దఫాల చర్చల  నడుమ ఆఫీసర్లు  జూన్ 16న మేడిగడ్డ వద్ద మోటార్లు ఆన్​ చేశారు. జులై 4 వరకు 19 రోజుల్లో 32 టీఎంసీలను ఎత్తిపోశాక ప్రభుత్వం మనసు మార్చుకుంది. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ప్రాజెక్టు ఆఫీసర్లు 5, 6 తేదీల్లో రెండు రోజులపాటు మోటర్లు బంద్​ పెట్టారు. తర్వాత మళ్లీ 7వ తారీఖు సాయంత్రం మోటార్లను ఆన్ చేసి  8వ తారీఖు సాయంత్రం బంద్ పెట్టారు. మొత్తం మీద ఈ సీజన్​లో ఇప్పటివరకు 20 రోజుల్లో లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీలోంచి 33 టీఎంసీల నీళ్లను సరస్వతి(అన్నారం) బ్యారేజీలోకి, సరస్వతి నుంచి 30.72 టీఎంసీలను పార్వతి(సుందిళ్ల) బ్యారేజీలోకి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేశారు. పార్వతి (సుందిళ్ల) బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి  32 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి మిడ్​ మానేరుకు 23.458 టీఎంసీలు ఎత్తిపోశారు. మిడ్ ​మానేరు నుంచి ఎల్​ఎండీకి 12.710 టీఎంసీలు,  రంగనాయక సాగర్​కు 2.706 టీఎంసీలు ఎత్తిపోశారు.  


ఎక్కడ ఎత్తిపోయాలో తెలుస్తలే
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మల్లన్న సాగర్ పూర్తి కాకపోవడంతో నీటిని ఎక్కడ ఎత్తిపోయాలో ఆఫీసర్లకు సమజైతలేదు.  రంగనాయక సాగర్ (3 టీఎంసీలు), కొండపోచమ్మ సాగర్​ (15 టీఎంసీలు) కొత్త రిజర్వాయర్లు కావడంతో రూల్స్​ ప్రకారం ఫుల్​గా నింపడం సాధ్యం కాదు. అందుకే రంగనాయకసాగర్​లో 2.7, కొండపోచమ్మ సాగర్​లో 6.8 టీఎంసీలు మాత్రమే మెయింటేన్​ చేస్తున్నారు. మిడ్​ మానేరులో 27.5  టీఎంసీలకుగాను 23.22 టీఎంసీలు, ఎల్​ఎండీలో 24 టీఎంసీలకుగాను 20.74 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఈ రెండు కీలకమైన ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. ఇక కాళేశ్వరంలోని మూడు రిజర్వాయర్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతోపాటు ఎల్లంపల్లి రిజర్వాయర్​లో దాదాపు 56 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశముండగా, ప్రస్తుతం దాదాపు 40 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ నాలుగు రిజర్వాయర్లలో మరో 16 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశమున్నా.. ఎత్తిపోశాక వర్షాలో, పైనుంచి వరదలో వస్తే కిందికి వదలాల్సిందే. అందుకే ఆఫీసర్లు మోటార్లు బంద్ పెట్టి వానల కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టమవుతోంది.  ​

నిరుడు కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లియ్యలే 
కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌  ద్వారా ఏటా  225 టీఎంసీల గోదావరి నీళ్లను లిఫ్ట్‌‌ చేసి 40 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పాత ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 18.25 లక్షల ఎకరాల భూమికి సాగునీరు ఇవ్వాల్సి ఉంది. నిరుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్తగా 12.71 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రభుత్వం బడ్జెట్​ ప్రతిపాదనల్లో పేర్కొన్నా.. కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేపోయింది. కీలకమైన మల్లన్న సాగర్​ సహా  17 రిజర్వాయర్ల నుంచి మెయిన్​ కెనాల్స్​, డిస్ట్రిబ్యూటరీలు పెండింగ్​లో ఉండడంతో గతేడాది కరీంనగర్​, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు నీళ్లందక పలుచోట్ల పంటలు ఎండిపోయాయి.