- సింగరేణి కార్మికులకు..లాభాల వాటా చెల్లింపు వాయిదా
- ఎన్నికల కోడ్ రావడంతో యాజమాన్యం నిర్ణయం
భద్రాద్రి కొత్తగూడెం/ కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి కార్మికులకు చెల్లించే లాభాల బోనస్ పై సందిగ్ధత నెలకొంది. 2022–-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల్లో కార్మికులకు దాదాపు రూ .711 కోట్లు చెల్లిస్తామని ఈనెల 4న యాజమాన్యం ప్రకటించింది. లాభాల్లో 32 శాతం (రూ.711 కోట్లు) కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని ఈనెల 16న యాజమాన్యం ప్రకటించింది. చెల్లింపు జరగాల్సిన నాటికి రెండు రోజుల ముందు ఎన్నికల కోడ్ కారణంగా వాటా పంపిణీ వాయిదా వేస్తున్నామని యాజమాన్యం ప్రకటించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత చెల్లింపులు చేస్తామని యాజమాన్యం తెలిపింది.
సద్దుల బతుకమ్మ, దసరా ముందు లాభాల బోనస్ ఇస్తే పండుగలు ఘనంగా జరుపుకోవాలని భావించిన కార్మికులకు యాజమాన్యం నిర్ణయంతో నిరాశ ఎదురయ్యింది. ఎలక్షన్ కోడ్ పేరుతో చెల్లింపులను వాయిదా వేయడం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమేనని ఏఐటీయూసీ, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, సీఐటీయూ సంఘాల నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, యాదగిరి సత్తయ్య, బి.జనక్‌ప్రసాద్, మంద నర్సింహారావు మండిపడ్డారు. కోడ్ అమల్లోకి వచ్చే ముందే లాభాల చెల్లింపు ప్రకటన చేశారని, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి రాదన్నారు. లాభాల వాటాను కంపెనీ నిధుల నుంచే ఇస్తారని, ఈ డబ్బులకు రాష్ట్ర ఖజానాకు ఏవిధమైన సంబంధం లేదని నేతలుపేర్కొన్నారు.