అధికారుల మధ్య కోఆర్డినేషన్​ లోపం..ఆగమైన గ్రేటర్​ జనం

అధికారుల మధ్య కోఆర్డినేషన్​ లోపం..ఆగమైన గ్రేటర్​ జనం
  • ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై నో క్లారిటీ
  • మంగళవారం నుంచే అని ప్రకటనలు 
  •  అప్లికేషన్లతో ఆఫీసుల  చుట్టూ ప్రజల చక్కర్లు
  • ఎక్కడా తీసుకోకపోవడంతో తిప్పలు...
  • ప్రజా భవన్​ దగ్గర కిలో మీటర్ క్యూ లైన్

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ దరఖాస్తుల స్వీకరణ విషయంలో గందరగోళం నెలకొంది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, సివిల్ సప్లయీస్​ ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపంతో వార్డు సభలు నిర్వహించకపోవడం, ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ఫెయిల్​కావడంతో జనం తిప్పలు పడ్డారు.  ప్రజాపాలన, కుల గణన సర్వే సందర్భంగా చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తయ్యిందని, అర్హులను గుర్తించామని, మంగళవారం గ్రామ, వార్డు, బస్తీ సభలు పెట్టి జాబితా ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

26వ తేదీ నుంచే కొత్త రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని పేర్కొంది.  మంగళవారం నుంచి నిర్వహించే గ్రామ, వార్డు, బస్తీ సభల్లోనే రేషన్​కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. హైదరాబాద్​లో కూడా ఇలాగే కొనసాగుతుందని అందరూ అనుకున్నారు.  సివిల్​సప్లయీస్​కు సంబంధించిన చీఫ్​రేషనింగ్​ఆఫీసర్​కూడా హైదరాబాద్​లో మంగళవారం నుంచి వార్డు సభలు నిర్వహించి రేషన్ ​కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. 

ఇతర జిల్లాల్లో లెక్కనే తీసుకుంటరని...

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి గ్రామసభలు పెట్టి అర్హుల జాబితాను చదివి వినిపించడంతో పాటు అప్లికేషన్లను తీసుకోవడం మొదలుపెట్టారు.  దీంతో నగరవాసులు కూడా అప్లికేషన్​ఫారాలు పట్టుకుని దరఖాస్తు చేసుకునేందుకు బయలుదేరారు. వార్డు, గ్రామసభలు ఎక్కడ పెడుతున్నారని ఎవరినడిగినా సరైన సమాధానం దొరకలేదు. బల్దియా జోనల్, సర్కిల్​ఆఫీసులకు వెళ్లగా అప్లికేషన్లు తీసుకోవడం లేదని, ఇప్పుడే అర్హుల జాబితా ప్రకటించడం లేదని చెప్పారు. ఏం చేయాలో తెలియక కొంతమంది తహసీల్దార్​ఆఫీసులు, మీసేవా కేంద్రాలకు తరలివెళ్లారు. అక్కడ కూడా అప్లికేషన్లు తీసుకోవడం లేదని కలెక్టరేట్​కు క్యూ కట్టారు. రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సంగతి జీహెచ్ఎంసీ చూసుకుంటోందని అక్కడి సిబ్బంది చెప్పడంతో కొందరు సివిల్​సప్లయీస్ ​ఆఫీసులకు వెళ్లి వాకబు చేశారు. చివరకు ఎక్కడా ఏ అప్లికేషన్​ తీసుకోవడం లేదని వెనుతిరిగారు. 

ప్రజాభవన్ ​వద్ద కిక్కిరిసిన జనం  

గ్రేటర్ ​వ్యాప్తంగా ఎక్కడా రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు తీసుకోకపోవడంతో ప్రతి మంగళవారం ప్రజాభవన్​లో ప్రజావాణి జరుగుతుందని తెలుసుకుని చాలామంది అక్కడికే క్యూ కట్టారు. దీంతో ప్రజాభవన్​దగ్గర సుమారు కిలోమీటర్​మేర భారీ లైన్​ కనిపించింది. 5,736 దరఖాస్తులు రాగా 5,332 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినవే ఉన్నాయి.  

వచ్చే నెల ఫస్ట్ వీక్​ అంటూ ప్రకటన  

గ్రేటర్ లో కొత్త దరఖాస్తులను ఎప్పుడు తీసుకుంటారనే దానిపై స్పష్టత ఇవ్వని అధికారులు వచ్చేనెల మొదటి వారంలో వార్డుసభలు ఉండొచ్చని తెలిపారు. ఆ సభల్లోనే అర్హులను ప్రకటించి కొత్త దరఖాస్తులు తీసుకుంటామని చెప్తున్నారు. తేదీని త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి కాలేదనేనా... 

కులగణన సర్వేలో రేషన్ కార్డుల కోసం 83,285 మంది నుంచి అప్లికేషన్లు వచ్చాయి. వీటి వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది. ఇందులో 90 శాతం మంది అర్హులున్నట్లు బల్దియా, రెవెన్యూ, సివిల్ సప్లయీస్​అధికారులు తేల్చారు. అలాగే, ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లకోసం 10,70,659  దరఖాస్తులు రాగా, వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 78శాతం మాత్రమే సర్వే పూర్తి కావడం, మరో 20 శాతం సర్వే పెండింగ్​లో ఉండడంతో లిస్ట్ తయారు కాలేదని తెలుస్తోంది.
 
స్పందించని బల్దియా కమిషనర్​

గ్రేటర్​లో రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు సంబంధించి వార్డు సభలు పెట్టకపోవడం, జనం ఆఫీసుల చుట్టూ తిరగడంపై బల్దియా కమిషనర్​ఇలంబరితిని సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మూడు శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని తెలుస్తుండగా, సివిల్​సప్లయీస్, రెవెన్యూ అధికారులు మాత్రం వార్డు సభలు పెట్టాల్సింది బల్దియానే అని చెప్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు మూడు సార్లు ఫోన్​చేసినా కమిషనర్​లిఫ్ట్​ చేయలేదు.  

బల్దియానే చూస్కోవాలి 

మంగళవారం మా ఆఫీసులకు రేషన్​కార్డుల కోసం అప్లై చేస్తామని, దరఖాస్తులు తీసుకోవాలని చాలామంది వచ్చారు. వాస్తవంగా మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సభలు పెట్టి అర్హులను ప్రకటించి అప్లికేషన్లు తీసుకున్నారు. నగరంలో కూడా అదేవిధంగా ఉంటుందని అనుకున్నాం. కానీ, కొన్ని కారణాల వల్ల వార్డు సభలు పెట్టలేదు. మా దగ్గరకు వచ్చినవారిని బల్దియా ఆఫీసర్లను కలవాలని చెప్పి పంపించాం. బల్దియానే వార్డు సభల తేదీలు ప్రకటిస్తుంది.  – రమేశ్, డీఎస్​ఓ, సివిల్ ​సప్లయీస్

జీహెచ్ఎంసీనే ప్రకటిస్తుంది 

హైదరాబాద్​లో అర్హుల జాబితా ప్రకటించడంతో పాటు దరఖాస్తుల స్వీకరణ విషయం బల్దియానే చూసుకుంటుంది. రేషన్​కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల జాబితా ప్రకటన, అప్లికేషన్ల స్వీకరణ తేదీ కమిషనర్​ప్రకటిస్తారు.  – అనుదీప్, హైదరాబాద్​ కలెక్టర్