- అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవ్
- ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్లు, అనర్హుల పేర్లు
- రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12.60 లక్షల మంది దరఖాస్తు
- ఇప్పుడు లిస్టుల్లో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు
- తమ పేర్లు తీసుకోవాలని లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త రేషన్‌కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్‌చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదా లిస్టులను ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టుల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆయాచోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ల పేర్లు మళ్లీ జాబితాల్లో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా లిస్టుల్లో కనిపించాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్‌కార్డు లేని వారి పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం.. ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కట్టారు. కొన్నిచోట్ల అధికారులను నిలదీయడమేగాక, సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్లు వందకుపైగా ఉంటే, గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టుల్లో 50 మంది కూడా లేరు. అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ల పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్లోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో నివాసముండే వారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.
ప్రజాపాలన దరఖాస్తులను పక్కనపెట్టడం వల్లే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోయినేడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా అభయ హస్తం కింద ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నది.ఈ కార్యక్రమంలోనే రేషన్‌కార్డుల కోసం అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందులో రేషన్‌కార్డుల కోసం 12.60 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఈ డేటా కాకుండా.. కులగణన సర్వే సమాచారం ప్రకారం జాబితాలను జిల్లాలకు పంపుతు న్నట్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రభుత్వం గత నవంబర్‌లో దాదాపు 45 రోజుల పాటు కులగణన సర్వే చేసింది. ఇందులో రేషన్‌కార్డు ఆప్షన్‌కూడా పెట్టారు.
ఇందులో అనర్హులైన ధనిక రైతులు, వ్యాపారులు, సంపన్నులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లకు తమకు రేషన్ కార్డు లేదని చెప్పడం, తమ ఆస్తుల వివరాలు దాచడంతో వారంతా రేషన్ కార్డుల అర్హుల జాబితాలోకి చేరిపోయినట్టు తెలుస్తున్నది. ఈ సమాచారాన్నే సివిల్సప్లయ్డిపార్ట్మెంట్క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఫైనల్అర్హుల లిస్టును ఖరారు చేసేందుకు జిల్లాలకు పంపింది. జిల్లాల నుంచి మండలాలు, గ్రామాల వారీగా జాబితాను పంచాయతీల్లో ప్రచురించారు. రేషన్‌కార్డు జారీకి ఉండాల్సిన అర్హతలను సరిపోల్చకుండానే జాబితా రిలీజ్చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఇప్పటికే రేషన్‌కార్డు ఉన్నోళ్ల పేర్లు రావడం, రేషన్‌కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్నోళ్ల పేర్లు రాకపోవడంతో ప్రభుత్వం జిల్లాలకు పంపిన సమాచారం అస్తవ్యవస్తంగా, అసంపూర్ణంగా ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 91 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి.
ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి కొత్తగా కార్డులు ఇస్తే ఇంకో 10 లక్షలు దాకా పెరగనున్నాయి. కానీ దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగానికి పైగా పేర్లు తాజాగా ప్రకటించిన లిస్టుల్లో లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్‌కార్డుల్లో పేర్లు లేని వారు ఏం చేయాలి? ఏ ప్రాతిపదికన లిస్టును విడుదల చేశారు? మళ్లీ మరో లిస్టు వస్తుందా? ఇప్పటికే రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల్లో వ్యక్తుల పేర్లు చేర్చడం ఎలా? అనే విషయాలపై క్లారిటీ లేక జనం సతమతమవుతున్నారు. కనీసం ప్రజాపాలన దరఖాస్తులనైనా పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే ఈ సర్వేలోనే తమ పేర్లను చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని అర్హులు కోరుతున్నారు.
అన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం..
.ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందడానికి రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకోవాలన్నా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల్లో ప్రయోజనం పొందాలన్నా, కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు కావాలన్నా, ప్రభుత్వం ప్రతినెలా కుటుంబంలో ప్రతి సభ్యుడికీ ఉచితంగా అందించే ఆరు కిలోల బియ్యం పొందాలన్నా తెల్ల రేషన్ కార్డు కీలకంగా మారింది.
Also Read :- సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం
ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రావాలన్నా ఈ రేషన్ కార్డు తప్పనిసరి. రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం రేషన్‌కార్డును పరిగణనలోకి తీసుకున్నది. దీంతో పదేండ్లలో కుటుంబాలు వేరు పడినవాళ్లు, పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా పిల్లలు కలిగినవాళ్లు రేషన్ కార్డు కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వచ్చిన రేషన్ కార్డుల జాబితా ఫైనల్ కాకపోయినప్పటికీ అర్హుల పేర్లు మాయమై, అనర్హుల పేర్లు రావడంతో అంతా గందరగోళం నెలకొన్నది.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో కొత్త రేషన్ కార్డుల సర్వే జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయంటూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిని నిలదీశారు. రేషన్ కార్డుల జాబితాలో అర్హులందరి పేర్లు వచ్చాకే సర్వే నిర్వహించాలని కోరుతూ నంగునూరు తహసీల్దార్, ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ పరిస్థితి..
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల లిస్టులో రిటైర్డ్ సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పేర్లు వచ్చాయి. అదే సమయంలో అర్హుల పేర్లు రాలేదు. దీనిపై మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అర్హులకే రేషన్ కార్డులు ఇవ్వాలని, అనర్హుల పేర్లను తొలగించాలని తహసీల్దార్ ను డిమాండ్‌చేశారు. లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ లో ఇప్పటికే రేషన్‌కార్డు ఉన్నవారి పేర్లు లిస్టులో వచ్చాయి. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా పెళ్లై అత్తారింటికి వచ్చిన మహిళలు కులగణన సర్వేలో తమ పేర్ల మీద కొత్త రేషన్ కార్డు కావాలని కోరారు. కానీ రికార్డులు చెక్ చేసిన సివిల్ సప్లై ఆఫీసర్లు వారికి పుట్టిన ఊళ్లలో రేషన్ కార్డు ఉన్నట్టు గుర్తించి కొత్త జాబితాలో చోటు కల్పించలేదు. ఇలాంటి వారు పెద్దసంఖ్యలో ఉన్నట్టు తెలిసింది.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీ కే గ్రామానికి చెందిన కూనరపు అశోక్ కు వివాహం జరిగి పదేండ్లు అవుతోంది. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కానీ తాజా జాబితాలో ఆయన పేరు లేదు. తన తర్వాత పెళ్లి చేసుకున్న వారికి రేషన్ కార్డు జాబితాలో పేరు వచ్చిందని, తనను మాత్రం ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదని ఆఫీసర్ల ముందు వాపోయాడు. ఈ గ్రామంలో 18 మంది పేర్లు రాగా తన తర్వాత పెళ్లి చేసుకున్న ఐదుగురు ఉన్నట్టు అశోక్ తెలిపాడు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం డౌనెల్లి గ్రామంలో ప్రచురించిన జాబితాలో పలువురు అర్హుల పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందారు. దీనిపై శుక్రవారం తహసీల్దార్ ఎజాజ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమ పేర్లను ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. అయితే ఈ జాబితా పైనుంచి వచ్చిందని, దానిపై తాము కేవలం పరిశీలన జరుపుతున్నామని తహసీల్దార్ తెలిపారు.