రిపబ్లిక్ డే వేడుకలపై అయోమయం

రిపబ్లిక్ డే వేడుకలపై అయోమయం
  • నిరుటిలెక్కనే సీఎం ప్రగతిభవన్​లో గవర్నర్ రాజ్ భవన్​లో జెండా ఎగరేస్తారంటూ చర్చ  
  • గవర్నర్​కు స్పీచ్ కాపీ పంపేందుకు మాత్రం ఏర్పాట్లు  
  • వేడుకలు వద్దు.. గవర్నర్​కు ఇన్విటేషన్ పంపొద్దని సీఎం నిర్ణయం!

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నెల 26న నిర్వహించాల్సిన రిపబ్లిక్ డే వేడుకలపై అయోమయం నెలకొన్నది. ఛబ్బీస్ జనవరి వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై సీఎంవో నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు  ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిసింది. దీంతో పోయిన ఏడాదిలాగే ఈసారి కూడా రిపబ్లిక్ డే వేడుకలను పబ్లిక్ గా నిర్వహించరేమోనన్న చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2021, అంతకుముందు సంవత్సరాల్లో రిపబ్లిక్ డే వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి గవర్నర్ హాజరై ప్రసంగించే ఆనవాయితీ పాటించింది. కానీ రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ పెరగడంతో నిరుటి నుంచీ ప్రభుత్వం ఆనవాయితీలను పక్కనపెడుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ కు ఆహ్వానం పంపడంలేదు. పంద్రాగస్ట్, ఛబ్బీస్ జనవరి వేడుకలతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చేందుకూ గవర్నర్ ను పిలవడంలేదు. ఇప్పుడు కూడా గవర్నర్​కు ఆహ్వానం పంపకూడదని, రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం పబ్లిక్ గా నిర్వహించరాదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకలు, గవర్నర్ కు ప్రొటోకాల్ పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారుగా.. అంటూ ఇటీవలే గవర్నర్ తమిళిసై మీడియాతో కామెంట్ కూడా చేశారు.    

స్పీచ్ కాపీ పంపడంతోనే సరి!

పోయిన ఏడాది కరోనా సాకుతో ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించలేదు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్​లో జెండాను ఆవిష్కరించారు. గవర్నర్ తమిళిసై రాజ్​భవన్​లో వేడుకలు నిర్వహించి.. ప్రభుత్వం పంపిన స్పీచ్ కాపీని చదివారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ఇతర వివరాలను కలిపి గవర్నర్ ప్రసంగించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కాలేదు. ఇక ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పథకాలు, ఇతర ముఖ్య కార్యక్రమాల వివరాలతో అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి స్పీచ్ కాపీలు జీఏడీకి అందాయి. వాటన్నింటి నుంచి పూర్తి స్థాయి స్పీచ్​ను తయారు చేసి గవర్నర్ ప్రసంగానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రిపబ్లిక్ డే వేడుకల కోసం గవర్నర్ కు ఎలాంటి ఆహ్వానం వెళ్లలేదు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. టైం ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నా.. ఏర్పాట్లపై అటు పోలీస్ శాఖ, ఇటు కల్చరల్ శాఖ, జీఏడీ మాత్రం కిమ్మనడం లేదు. గవర్నర్​కు స్పీచ్ కాపీ ఇస్తారు కానీ.. ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలవరు అన్న విమర్శలు వస్తున్నాయి.