హైదరాబాద్‌లో సన్న బియ్యం ఆలస్యం .. ఇప్పటికీ రాని స్పష్టత

 హైదరాబాద్‌లో సన్న బియ్యం ఆలస్యం .. ఇప్పటికీ రాని స్పష్టత
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ నేపథ్యంలో అధికారుల్లో సందిగ్ధత 
  • క్లారిటీ కోసం పౌరసరఫరాల కమిషనర్​కు సీఆర్​వో లెటర్

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకం హైదరాబాద్​ జిల్లాలో ఆలస్యంగా అమలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్​ 1 నుంచి అన్నిరేషన్​ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది సందర్భంగా హుజూర్​ నగర్​లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే, హైదరాబాద్​ జిల్లా పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఏప్రిల్​25 వరకూ సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. 

షాపులకు చేరుకున్న దొడ్డు బియ్యం

సన్న బియ్యం పంపిణీ చేయాలంటూ తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సీఆర్ఓ ఫణీంద్ర రెడ్డి తెలిపారు. ఇప్పటికే అన్ని రేషన్​షాపులకు దొడ్డు బియ్యం చేరుకుందన్నారు. అయితే, ఈ విషయంలో క్లారిటీ కోసం పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు లెటర్​రాసినట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అయితే, ఆదివారం వరకూ రిప్లై రాకపోవడం, ఇప్పటికే రేషన్​షాపులకు దొడ్డు బియ్యం చేరుకోవడంతో ఈ నెల పంపిణీ ఉండకపోవచ్చని తెలుస్తున్నది.
 
ఆరు లక్షలకుపైగానే కార్డులు  

హైదరాబాద్​నగరంలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, 653 రేషన్​షాపులున్నాయి. మొత్తం 6,39,451 రేషన్​కార్డులు ఉండగా, అన్నపూర్ణ ఫుడ్​సేఫ్టీ కార్డులు(ఏఎఫ్​ఎస్​సి) 29,684, ఫుడ్​ సేఫ్టీ లబ్ధిదారులు(ఎఫ్​ఎస్​) 6,08,577 మంది, అన్నపూర్ణ అంత్యోదయ పథకం (ఏఏపి) కింద 1,290 మంది లబ్ధిదారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి తలా ఆరు కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు.