- ఆరుతడి పంటలకే అందనున్న సాగునీరు
- కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లిఫ్టింగ్ బంద్
- ఇప్పటికే కడెం కింద క్రాప్ హాలీడే ప్రకటన
- ఎల్లంపల్లి ప్రాజెక్టులో 14 టీఎంసీలే నిల్వ
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని గూడెం లిఫ్ట్ కింద యాసంగిలో వరిసాగుపై అయోమయం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లిఫ్టింగ్ బంద్ కావడం, కడెం ప్రాజెక్టులో నీళ్లు లేక క్రాప్ హాలీడే ప్రకటించడం, ఎల్లంపల్లి ప్రాజెక్టులో 14 టీఎంసీలే నిల్వ ఉండడంతో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. గూడెం లిఫ్ట్ నుంచి కడెం ఆయకట్టు పరిధిలోని 30వేల ఎకరాలకు 3 టీఎంసీల నీటిని అందించాలి. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగినంత నిల్వ లేకపోవడంతో ఈసారి 2 టీఎంసీలే ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. అది కూడా ఆరుతడి పంటల కోసం మార్చి నెలాఖరు వరకు మాత్రమే అందిస్తామని స్పష్టం చేశారు.
దీంతో వరిసాగుపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గూడెం లిఫ్టుపై ఆశతో బోర్లు, బావుల కింద నార్లు పోసిన రైతులు దిక్కుతోచక తలపట్టుకుంటున్నారు. జిల్లాలో యాసంగి సీజన్ లేట్‌గా స్టార్ట్ అవుతుండడంతో రైతులు ఇప్పుడిప్పుడే నార్లు పోస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో నాట్లు పడితే ఏప్రిల్, మే నెలల్లో పంట కోతకు వస్తుంది. మార్చి నెలాఖరు వరకే వారాబందీ పద్ధతిలో ఆరుతడులు రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఈసారి గూడెం లిఫ్ట్కింద వరి సాగుపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు.
పైపులు పగిలితే అంతే సంగతులు
కడెం ప్రాజెక్టు కింద ఉన్న దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు గూడెం లిఫ్ట్‌ను నిర్మించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీలను లిఫ్ట్ చేసి 30వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. గూడెం లిఫ్ట్‌ను 2015లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించిన దాఖలాలు లేవు. తరచూ పైపులైన్లు పగిలిపోవడం వల్ల ఏటా అరకొరగానే అందిస్తున్నారు.
గూడెంలోని పంపుహౌస్దగ్గరి నుంచి తానిమడుగు వద్దనున్న కడెం మెయిన్ కెనాల్ వరకు 12 కిలోమీటర్లు నిర్మించిన పైపులైన్ నాణ్యత లోపమే దీనికి ప్రధాన కారణం. ఎంఎస్(మైల్డ్‌స్టీల్) పైపులకు బదులు జీఆర్పీ(గ్లాస్రీ ఇన్ఫోర్స్ డ్ పాలిస్టర్) పైపులు వేయడం వల్ల రెండు మోటార్లు ఆన్ చేసినప్పుడు ప్రెజర్తట్టుకోలేక పగిలిపోతున్నాయి. మొత్తం 12 కిలోమీటర్లు జీఆర్పీ పైపులను తొలగించి ఎంఎస్ పైపులు వేయడమే ఈ సమస్యకు పరిష్కారమని అధికారులు తేల్చారు.
కానీ ఫండ్స్ కొరత వల్ల కేవలం 2.5 కి.మీ. మాత్రమే ఎంఎస్ పైపులు వేశారు. అవి కూడా ఇతర ప్రాజెక్టుల్లో వాడి నిరుపయోగంగా ఉన్నవాటిని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇటీవల రెండుసార్లు ట్రయల్‌రన్ చేపట్టినప్పటికీ లీకేజీలను నిరోధించలేకపోయారు. దీంతో గూడెం లిఫ్ట్ నుంచి ఈసారి కూడా వాటర్ రిలీజ్‌పై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం, కడెం ఎఫెక్ట్
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ప్రారంభించినప్పటి నుంచి ఎల్లంపల్లిలో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. గూడెం లిఫ్ట్‌కు సరిపడా బ్యాక్ వాటర్ అందుబాటులో ఉంటోంది. కానీ ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి లీకేజీలు ఏర్పడడంతో అక్కడి నుంచి రివర్స్ పంపింగ్బంద్ అయ్యింది. బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యే వరకు ఎల్లంపల్లిలోకి లిఫ్టింగ్ చేసే చాన్స్ లేదు.
మరోవైపు కడెం ప్రాజెక్టు గేట్లు వరదలకు దెబ్బతినడం వల్ల నీళ్లన్నీ గోదావరి పాలయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద యాసంగిలో క్రాప్ హాలీడే ప్రకటించారు. ఇటు కాళేశ్వరం నుంచి, అటు కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉన్న నిల్వలనే పొదుపుగా వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 146 మీటర్ల నీటిమట్టం ఉంది. 137.5 మీటర్ల లెవల్‌వరకు గూడెం లిఫ్ట్ నడుస్తుందని, ఆ లెవల్‌ను మెయింటెన్ చేస్తామని అధికారులు చెప్తున్నారు.
పొదుపుగా వాడుకోవాలి
కడెం ప్రాజెక్ట్ లెఫ్ట్మెయిన్కెనాల్చివరి ఆయకట్టు (డీ30 నుంచి డీ42)కు యాసంగిలో ఆరుతడి పంటలకు ఈ నెల 6 నుంచి మార్చి నెలాఖరు వరకు వాటర్రిలీజ్చేస్తం. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిరుటి కంటే ప్రస్తుతం తక్కవ నీళ్లున్నాయి. యాసంగి పంటలకు సరిపోయే నీళ్లు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఆయకట్టు రైతులు విలువైన సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - విఠల్, ఈఈ, కడెం ప్రాజెక్టు