
మెదక్, వెలుగు : ఎన్నికల ముందు మెదక్ జిల్లాలో ఓట్లకోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మంజూరు చేసినస్పెషల్ డెవలప్ మెంట్ వర్క్స్ (ఎస్డీఎఫ్)పై అయోమయం నెలకొంది. అప్పటి ఎమ్మెల్యేలు ఈ నిధులను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించారు.
కొన్ని పనులకు అప్పటి మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపనలు కూడా చేయించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్అధికారంలోకి రావడంతో ఎస్డీఎఫ్ పనులు యధావిధిగా కొనసాగిస్తారా? లేడా క్యాన్సిల్ చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాది ఆగస్టు నెలలో మెదక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ మున్సిపాలిటీ కి రూ.50 కోట్లు, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీ లకు రూ. 25 కోట్ల చొప్పున, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు గత సెప్టెంబర్ 5వ తేదీన రూ.198 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కుల సంఘాల ఓట్ల కోసం
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఎస్డీఎఫ్ కింద పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ పలు సామాజిక వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా కుల సంఘాలకు జాగాలు కేటాయించడంతో పాటు, బిల్డింగ్ ల నిర్మాణానికి ఎస్డీఎఫ్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది.
అలాగే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతు కూడ గట్టుకునేందుకు ఆయా సంఘ భవనాలకు సైతం భారీగా నిధులు కేటాయించింది. మెదక్, రామాయంపేట మున్సిపల్ పట్టణాల పరిధిలో అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి హామీ మేరకు మంజూరైన స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ లో ఎక్కువ శాతం కుల సంఘాలకు కేటాయించారు. మెదక్ పట్టణానికి రూ.50 కోట్లు మంజూరు కాగా వాటిని 104 పనులకు కేటాయించారు. ఇందులో సింహ భాగం వివిధ సంఘాలకే కేటాయించారు. రామాయంపేట పట్టణానికి ముఖ్యమంత్రి హామీ మేరకు మంజూరైన రూ.25 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో సైతం వివిధ కుల సంఘాల భవనాలకు భారీగా నిధులు కేటాయించారు. అలాగే మేస్త్రీ యూనియన్, ఆటో యూనియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ అసోసియేషన్లకు నిధులు కేటాయించారు.
వ్యతిరేకత తగ్గించుకునేందుకు
ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు గుర్తించి ఆయా వర్గాలను అనుకూలంగా మలుచుకునేందుకు ఎస్డీఎఫ్లోఆయా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ భవనాలకు భారీగా నిధులు కేటాయించారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో పీఆర్టీయూ భవన్ కు రూ.25 లక్షలు, ఎస్టీయూ భవన్ కు రూ.25 లక్షలు, టీపీయూఎస్ భవన్ కు రూ.25 లక్షలు, టీపీటీఎఫ్ భవన్ కు రూ.25 లక్షలు, గవర్నమెంట్ టీచర్స్ యూనియన్ భవన్ కు రూ.25 లక్షలు, టీఎన్జీఓ భవన్కు రూ.50 లక్షలు, పీఈటీ భవన్ కు రూ.25 లక్షలు కేటాయించారు.
ప్రభుత్వం మారడంతో..
ఎస్డీఎఫ్ కింద నిధులు మంజూరైన కొద్ది రోజులకే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆయా పనులు చేపట్టలేక పోయారు. ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ది పొందే ఉద్దేశ్యంతో నిధులు కేటాయించినందున ఎస్ డీ ఎఫ్ వర్క్స్ క్యాన్సిల్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కాగా ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు రాకపోవడంతో సంబంధిత అధికారులు ఎస్డీఎఫ్ పనుల విషయంలో సందిగ్దంలో ఉన్నారు. మరోవైపు ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు చేయొచ్చని సంతోషించిన సర్పంచ్లు పనులు క్యాన్సిల్ అవుతాయన్న ప్రచారంతో నారాజ్ అవుతున్నారు.