గిరిజనేతరులకు గృహలక్ష్మి అందనట్లేనా?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గృహలక్ష్మి పథకం అమలుపై గందరగోళం నెలకొంది. గిరిజనేతరులకు పథకం అందుతుందా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అందరి దరఖాస్తులను పరిశీలిస్తున్నప్పటికీ, పలు చోట్ల అధికారులే గిరిజనేతరులకు అందడం కష్టమని చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరం సింగరేణి పరిధిలో ఉన్నప్పటికీ దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు ఇండ్లు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలోని వారికి గృహలక్ష్మి వర్తిస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. లక్ష్మీదేవిపల్లి మండలంతోపాటు పలు మండలాల్లో ఫారెస్ట్​ల్యాండ్లలో ఏండ్ల కాలంగా ఉంటున్న వారికి అమలు కష్టసాధ్యమేనని ఆఫీసర్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి 86,773 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం అధికారులు అర్హుల జాబితాను రూపొందించే పనిలో పడ్డారు. 

23 మండలాల్లో మూడు నాలుగు మండలాల్లోని కొంత భాగం తప్ప మిగిలినదంతా ఐదో షెడ్యూల్​లోని ఏజెన్సీ కిందకే వస్తుంది. 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరుల్లో10 శాతం మందికి కూడా పట్టాలు లేవు. 86,773 దరఖాస్తుల్లో దాదాపు సగం మేర గిరిజనేతరుల దరఖాస్తులే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, ఏజెన్సీ చట్టాల ప్రకారం గిరిజనేతరులకు గృహలక్ష్మి అందడం కష్టమని పలువురు ఆఫీసర్లు చెబుతున్నారు. రామవరం ప్రాంతంలో 350 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సింగరేణి ఈ ల్యాండ్​ను గవర్నమెంట్​కు అప్పగించలేదు. దీంతో ఈ ప్రాంతంలోని వారికి పట్టాలు లేవు. గృహలక్ష్మి పొందాలంటే పట్టా ఉందా అని ఆఫీసర్లు అడుగుతున్నారు. జనం వద్ద కేవలం ఇంటి, నల్లా పన్ను, కరెంట్​బిల్లులతో పాటు ఇతరులు తమకు అమ్మిన డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు.