సర్కారు నిర్ణయాలతో గందరగోళం.. మొట్టికాయలు వేసిన హైకోర్టు

సర్కారు నిర్ణయాలతో గందరగోళం.. మొట్టికాయలు వేసిన హైకోర్టు

మొన్న పెండింగ్​ మ్యుటేషన్లను క్లియర్​ చేయకుండానే ధరణి పోర్టల్

ఇప్పుడేమో పాత రెవెన్యూ చట్టం కింద సాదాబైనామాలకు అప్లికేషన్లు

పాత రెవెన్యూ చట్టం కింద సాదాబైనామాల అప్లికేషన్లు

6 లక్షల 74 వేల సాదాబైనామాల రెగ్యులరైజేషన్​కు బ్రేక్

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్ర సర్కారు అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలతో జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. మొన్న పెండింగ్​ మ్యుటేషన్లపై నిర్ణయం తీసుకోకుండానే ధరణి పోర్టల్​ ప్రారంభించి, డబుల్​ రిజిస్ట్రేషన్లకు ఆస్కారమిచ్చిన సర్కారు.. ఇప్పుడు మరో తప్పుతో దొరికిపోయింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక కూడా.. పాత చట్టం కింద సాదాబైనామాల రెగ్యులరైజేషన్​కు అప్లికేషన్లు స్వీకరించింది. దీనిపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. సాదాబైనామాల రెగ్యులరైజ్​ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకుపైగా అప్లికేషన్స్​ రాగా.. కోర్టు ఆర్డర్స్​తో 6 లక్షల 74 వేల సాదాబైనామాల రెగ్యులరైజేషన్​కు బ్రేక్​ పడింది. తమకు పట్టాలు వస్తాయన్న ఆశతో మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరి మరీ అప్లికేషన్లు పెట్టుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది.

అక్టోబర్‌‌‌‌ 29 తర్వాత వచ్చినవి పెండింగ్​లో..

కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక తీసుకున్న సాదాబైనామాల అప్లికేషన్లను పరిశీలించవద్దని హైకోర్టు బుధవారం ఆదేశించింది. రద్దయిన రెవెన్యూ చట్టం కింద ఎలా రెగ్యులరైజ్​ చేస్తారని అడ్వొకేట్ జనరల్​ను నిలదీసింది. ఇది పబ్లిక్​ను మోసం చేయడమేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో అక్టోబర్‌‌‌‌ 29వ తేదీ నుంచే కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. అంతకుముందే అక్టోబర్​12న సాదాబైనామాల రెగ్యులైజేషన్‌‌‌‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 112 జారీ చేసింది. అదే నెల 20 నుంచి అప్లికేషన్లను స్వీకరించగా.. 29వ తేదీ నాటికి 2 లక్షల 26 వేల 693 మంది అప్లై చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి మరో 6 లక్షల 74 వేల 201 అప్లికేషన్లు వచ్చాయి. 29వ తేదీ నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రావడంతో.. ఆ తేదీ తర్వాత వచ్చిన సాదాబైనామా అప్లికేషన్లన్నీ పెండింగ్​లో పడనున్నాయి.

క్లారిటీ లేకనే లక్షల్లో అప్లికేషన్లు

2016 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు సాదాబైనామాల రెగ్యులరైజేషన్​కు టీఆర్ఎస్​ ప్రభుత్వం అవకాశం కల్పించింది. తాజాగా అక్టోబర్​20 నుంచి మరోసారి చాన్స్​ ఇవ్వగా.. ఏకంగా 10 లక్షలకుపైగా అప్లికేషన్లు రావడం ఆఫీసర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది రైతులకు ఎలాంటి భూములను రెగ్యులరైజ్​ చేస్తారన్న విషయంలో క్లారిటీ లేకపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఆర్ఎస్ఆర్ (రీ సెటిల్మెంట్​ రిజిస్టర్​) రూల్స్​ ప్రకారం.. సాదాబైనామా కింద ఎలాంటి భూములకు పాస్​బుక్కులు జారీచేస్తరనే దానిపై జనాలకు అవగాహన కల్పించలేదు. 2014 జూన్ 2 తర్వాత కొనుగోలు చేసిన భూములకు, గవర్నమెంట్, అసైన్డ్, ఎస్సారెస్పీ ల్యాండ్స్​ ఇందులోకి రావనే విషయం రైతులకు తెలియలేదు. దీంతో ఆయా భూముల్లో సాగుచేసుకుంటున్న రైతులు, పెద్ద సంఖ్యలో పోడు రైతులు పట్టాబుక్కులు వస్తాయన్న ఆశతో మీ సేవా కేంద్రాలకు క్యూకట్టారు. గంటల తరబడి లైన్లు కట్టి వందల రూపాయలు పెట్టి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇక ధరణి వచ్చాక సాగు భూములకు సంబంధించి పాత డేటాను పబ్లిక్​ డొమైన్​ నుంచి డిలీట్​ చేశారు. దీంతో కొనుగోలుదారుల అప్లికేషన్లు ఆర్ఎస్ఆర్​ రూల్స్​ మేరకు ఉన్నాయా లేదా అని మీసేవా ఆపరేటర్లు చెక్​ చేసుకోలేకపోయారు. ఈ లెక్కన అప్లికేషన్లలో చాలావరకు రెగ్యులరైజేషన్​కు వీలుకానివేనని ఆఫీసర్లు చెప్తున్నారు.

సర్కారు తీరుతో జనంలో ఆందోళన

సర్కారు టార్గెట్లకు అనుగుణంగా రెవెన్యూ డిపార్ట్​మెంట్​ పెద్దాఫీసర్లు ఆగమాగం నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం అగ్రికల్చర్​ ల్యాండ్స్​​ను మొదట సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసులో రిజిస్ట్రేషన్​ చేయించాక.. తహసీల్దార్​కు అప్లై చేస్తే మ్యుటేషన్​ చేసేవారు. అలా కొత్త రెవెన్యూ చట్టం వచ్చే నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మ్యుటేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. వాటిపై నిర్ణయం తీసుకోకుండానే ఈ నెల 2న ధరణి పోర్టల్​ను హడావుడిగా అమల్లోకి తెచ్చారు. దాని ప్రకారం అగ్రికల్చర్​ ల్యాండ్స్​ను తహసీల్దార్లే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్​ చేస్తున్నారు. మ్యుటేషన్​ కాని భూములకు ధరణిలో పాత ఓనర్ల పేర్లే కనిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని డబుల్​ రిజిస్ట్రేషన్లు చేయడంతో ఆఫీసర్లు తలపట్టుకున్నారు. సాదాబైనామాల విషయంలోనూ సర్కారు ఇలాగే వ్యవహరించింది. అక్టోబర్‌‌‌‌29 నుంచే కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాగా.. పాత చట్టం ప్రకారం రెగ్యులరైజ్​ చేసేందుకు అప్లికేషన్లు స్వీకరించడంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది.

For More News..

హైదరాబాద్​కు ‘స్పుత్నిక్​ V’.. త్వరలో ట్రయల్స్