
రిజిస్ట్రేషన్ పరేషాన్!
సర్కారు కొత్త రూల్స్‌తో గందరగోళం.. పొద్దంతా సర్వర్ తిప్పలు
98 రోజుల తర్వాత మొదలు.. ఫస్ట్ రోజు 82 రిజిస్ట్రేషన్లే!
జీపీఏ, జాయింట్ ప్రాపర్టీస్, బ్యాంక్ మార్టిగేజ్ సహా పలు ఆప్షన్స్ మాయం
ఎన్నో డౌట్స్‌తో రిజిస్ట్రేషన్లకు ముందుకు రాని జనం
పాత పద్ధతిలో చేయాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోని సర్కారు
వెలవెలబోయిన సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు..
కొన్ని జిల్లాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలే..
పలుచోట్ల బిల్డర్లు, డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనలు
హైదరాబాద్, వెలుగు నెట్వర్క్: రాష్ట్రంలో మూడు నెలల తర్వాత నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు మొదలైనా.. సర్కారు పెట్టిన కొత్త రూల్స్ తో జనం పరేషాన్ అయితున్నరు. పాత పద్ధతే అని చెప్పిన సర్కారు కొత్తగా ధరణి విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టడం గందరగోళం రేపుతోంది. అసలు రిజిస్ట్రేషన్ కోసం ఏమేం అవసరమో, కొత్తగా ఏమేం రూల్స్ పెట్టారో అర్థంగాక సర్కారు తీరుపై మండిపడ్డరు. పలుచోట్ల ఆందోళనలకు దిగారు. ఇక కొత్త రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో లింక్ డాక్యుమెంట్ల వివరాలు, స్కెచ్మ్యాప్ లేకపోవడంతో భవిష్యత్తులో సమస్యలు వస్తాయన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి. తొలిరోజు సోమవారం కేవలం 82 రిజిస్ట్రేషన్లే జరిగాయి. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పుడు రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొదట బ్రేక్ పడింది. లాక్ డౌన్ ఎత్తేశాక కొంతకాలం రిజిస్ట్రేషన్లు జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తెస్తామని చెప్పి సెప్టెంబర్ 8 నుంచి రిజిస్ట్రేషన్లను ఆపేసింది.
తర్వాత పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు సుమారు నెల రోజుల కింద ప్రకటించింది. కానీ ధరణిలో డాక్యుమెంట్ల సేఫ్టీపై కొందరు కోర్టుకు వెళ్లడంతో విచారణ సాగుతోంది. పోర్టల్‌పై విచారణతో సంబంధం లేకుండా.. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో.. సోమవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. మొదటిరోజు 40 ఆఫీసుల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సీఎస్ కార్యాలయం ప్రకటించింది. మంగళవారం రిజిస్ట్రేషన్ల కోసం 58 చోట్ల 155 స్లాట్లు బుక్అయ్యాయని తెలిపింది.
స్లాట్ బుకింగ్‌కే చాన్స్ లేదు
పాత పద్ధతి (కార్డ్)లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నా.. సర్కారు ధరణిలోని ఆప్షన్లతోనే ప్రక్రియను ప్రారంభించింది. ప్రతి డాక్యుమెంట్‌కు ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ (టీపిన్, ఐపిన్) తప్పనిసరి చేసింది. ఆ నంబర్ లేని డాక్యుమెంట్లు రిజిస్టర్ కాలేదు. పాత ఇంటిని కూల్చి కొత్త నిర్మాణం చేపడితేనే టీపిన్ నంబర్ ఉంటుందని, కొత్త ప్లాట్లకు ఆ నంబర్ ఉండదని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఒక ఇంటిని కూల్చేసి.. ఆ స్థలంలో వేర్వేరు ఇండ్లు, ప్లాట్లుగా మారిస్తే వేర్వేరు టీపిన్ నంబర్లు ఉండవని, దానికి తామెట్ల బాధ్యులమవుతామని మండిపడ్డారు. పలుచోట్ల స్లాట్ బుక్ చేసుకుందామన్నా సర్వర్ సతాయించడంతో జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బ్యాంకు మార్టిగేజ్ ఆప్షన్ కూడా పోర్టల్‌లో కనిపించకపోవడంతో లోన్లు తీసుకొని ప్లాట్లు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. ఇక ఇల్లు, ఓపెన్ ప్లాట్, అపార్ట్ మెంట్‌లోని ఫ్లాట్లకు పర్మిషన్ లేకున్నా, బీఆర్‌ఎస్ కాకున్నా స్లాట్ బుక్ కాలేదు. వ్యక్తిగత ఆస్తులకే తప్ప జాయింట్ ప్రాపర్టీస్ ఆప్షన్ లేదు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ లాంటి ఆప్షన్లు లేకపోవడంతో చాలామంది స్లాట్బుక్చేసుకోకుండానే వెనక్కి వెళ్లిపోయారు.
లింక్ డాక్యుమెంట్ వివరాల్లేవ్
ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలకు వాటి లింక్ డాక్యుమెంటే కీలకం. అది లేకుంటే ఆస్తి ఎలా చేతులు మారుతూ వచ్చిందో చెప్పడం కుదరదు. అందుకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో లింక్ డాక్యుమెంట్ నంబర్ వేస్తారు. కొత్తగా ఇస్తున్న పత్రాల్లో ఆ వివరాలు లేవు. దీంతో భవిష్యత్‌లో లీగల్ ఇష్యూస్ తలెత్తే ప్రమాదం ఉందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టులు హెచ్చరిస్తున్నారు.
సర్వర్, టెక్నికల్ సమస్యలతో..
రిజిస్ట్రేషన్లపై నెలకొన్న అనుమానాలు, సర్కారు కొత్తగా పెట్టిన రూల్స్, టెక్నికల్ సమస్యలు వంటి వాటితో రిజిస్ట్రేషన్లకు పెద్దగా ముందుకు రాలేదు. కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో ఎలాంటి స్టాంపు పేపర్లు వాడట్లేదు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేసి.. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తున్నారు. సర్వర్ ప్రాబ్లం కారణంగా స్లాట్ల బుకింగ్ కూడా సరిగా జరగలేదు. బుక్ అయ్యి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారికి ఇబ్బందులు తప్పలేదు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రోజుకు 24 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ లెక్కన తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 3,408 డాక్యుమెంట్లు రిజిస్టర్కావాల్సి ఉంది. కానీ మొత్తంగా 82 రిజిస్ట్రేషన్లే జరిగాయి. అసలు గతంలో ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రోజుకు 60 డాక్యుమెంట్ల దాకా రిజిస్టర్ అయ్యేవని సబ్ రిజిస్ట్రార్లు చెప్తున్నారు.
మధ్యాహ్నం తర్వాతే షురూ..
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉదయం 10 గంటలకే తెరుచుకున్నా.. రిజిస్ట్రేషన్లు మధ్యాహ్నం తర్వాతే మొదలయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, రెడ్‌హిల్స్, బంజారాహిల్స్, చార్మినార్ ఆఫీసుల్లో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్టర్కాలేదు. చిక్కడపల్లిలో రెండు, ఆజంపురాలో నాలుగు, మారేడ్‌పల్లి, దూద్‌బౌలి, గోల్కొండ, ఎస్‌ఆర్ నగర్‌లో ఒక్కో డాక్యుమెంట్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలోని మిగతా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కలిపి కేవలం 76 డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలిగారు.
జగిత్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కామారెడ్డి, నిర్మల్, ములుగు, ఆసిఫాబాద్, జనగాం, ఖమ్మం జిల్లాల్లో నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు ఒక్కటి కూడా జరగలేదు. కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అయితే ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్లాట్స్ రిజర్వేషన్ కు వెళ్లినవారిని సబ్ రిజిస్ట్రార్లు ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ అడగడంతో వెనుదిరిగారు.
కరీంనగర్ జిల్లాలో గంగాధర, తిమ్మాపూర్, కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా.. ఒకే ఒక్క రిజిస్ట్రేషన్ జరిగింది.
నిర్మల్ జిల్లాలో సర్వర్ మొరాయించింది.
వరంగల్ జిల్లాకు సంబంధించి హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో నాలుగే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఖిలా వరంగల్, భీమదేవరపల్లి కార్యాలయాల్లో ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు.
మెదక్ జిల్లాలో 4 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా తూప్రాన్‌లో ఒక్క రిజిస్ట్రేషన్ జరిగింది.
సిద్దిపేట జిల్లాలో ఆరు ఆఫీసులు ఉంటే.. దుబ్బాకలో ఒకే ఒక్క గిఫ్ట్ రిజిస్ట్రేషన్ జరిగింది.
యాదాద్రి జిల్లాలో ముగ్గురు స్లాట్ బుక్ చేసుకోగా ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఒక్కటి, మంచిర్యాల జిల్లాలో రెండు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
డాక్యుమెంట్లకు కొత్త నంబర్లు
రిజిస్ట్రేషన్ పూర్తికాగానే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ డాక్యుమెంట్‌కు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌తోపాటు రిజిస్టర్ అయిన సంవత్సరం వేస్తారు. ఏటా జనవరిలో ఫస్ట్ జరిగే రిజిస్ట్రేషన్ ఒకటో నంబర్‌తో మొదలవుతుంది. చివరికి డిసెంబర్ 31న ఆ నెలలో చేసిన చివరి రిజిస్ట్రేషన్ నంబర్ వేస్తారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన జరిగిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్‌కు 1/2020 అనే నంబర్ కేటాయించారు. అయితే సోమవారం రిజిస్ట్రేషన్ అయిన ఫస్ట్ డాక్యుమెంట్‌కు అదే నంబర్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. సెప్టెంబర్ ఏడో తేదీన రిజిస్టరైన చివరి డాక్యుమెంట్ తర్వాతి నంబర్లను కొనసాగించాల్సి ఉండగా.. దానికి విరుద్ధంగా ఒకటో నంబర్ ఇచ్చారు. అంటే కొత్త పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు మొదలైనట్టు స్పష్టమవుతోంది.
స్కెచ్ మ్యాప్ లేదు
రిజిస్ట్రేషన్ పేపర్లలో ఇంటి స్థలం ఆకారం, పొడవు, వెడల్పు తెలిపే స్కెచ్ మ్యాప్ ఉండేది. కానీ కొత్త డాక్యుమెంట్లలో ఆ మ్యాప్ లేదు. ఆ ప్రాపర్టీ లొకేషన్ ను గుర్తించేందుకు సర్వే నంబర్ ప్రస్తావన కూడా లేదు. స్కెచ్ మ్యాప్ లేకుంటే ఇరుగుపొరుగుతో సరిహద్దుల వివాదం తలెత్తితే ఎట్లా పరిష్కరించుకుంటరో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
షెడ్యూల్ ఏరియాల్లో రిజిస్ట్రేషన్లు ఆపాలని హైకోర్టులో పిల్స్
ధరణి పోర్టల్ ద్వారా షెడ్యూల్ ఏరియాల్లోని భూముల రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపాలని కోరుతూ హైకోర్టులో పిల్స్ ఫైల్ అయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన సోయం కన్నరాజు, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఉద్యోగి కె.వీరమల్లు ఈ పిల్స్ వేశారు. చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల బెంచ్ సోమవారం వీటిపై విచారణ చేపట్టింది. గిరిజనుల హక్కులను కాపాడాలని పిటిషనర్ల తరఫు లాయర్ వసుధ నాగరాజ్ కోరారు. ఇప్పటికే ధరణిపై పిటిషన్లు ఫైల్ అయ్యాయని, వాటితో కలిపే ఈ పిల్స్ విచారిస్తామని హైకోర్టు చెప్పింది.
చలాన్ సొమ్ము పొయినట్టే..
ఆస్తిని కొనేవారు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని, చలాన్ కడితే.. అదే రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న రూల్‌ను కొత్త విధానంలో పెట్టారు. సోమవారం రిజిస్ట్రేషన్ కోసం చలాన్ కట్టిన కొందరు టెక్నికల్ సమస్యలతో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. వాళ్లు చలాన్ కోసం కట్టిన సొమ్ము తిరిగిరాదు. వాళ్లు మళ్లీ చలాన్ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం రిజిస్ట్రేషన్ కోసం 107 మంది స్లాట్ బుక్ చేసుకోగా.. 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. మిగతా 21 మంది డాక్యుమెంట్లు రిజిస్టర్కాలేదు.
ఇవీ సమస్యలు
ప్రతి డాక్యుమెంట్ కు ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ (టీపిన్, ఐపిన్) తప్పనిసరి చేసింది. ఆ నంబర్ లేని డాక్యుమెంట్లు రిజిస్టర్ కాలేదు.
బ్యాంకు మార్టి గేజ్ ఆప్షన్ కూడా పోర్టల్ లో కనిపించకపోవడంతో లోన్లు తీసుకొని ప్లాట్లు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు.
పలుచోట్ల స్లాట్ బుక్ చేసుకుందామన్నా సర్వర్ సతాయించడంతో జనం ఇబ్బంది పడ్డారు.
ఇప్పుడు ఇస్తున్న రిజిస్ట్రేషన్ పేపర్లలో లింక్ డాక్యుమెంట్ల వివరాలు లేవు. ఎవరు ఏ డాక్యుమెంట్ తెచ్చినా రిజిస్టర్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో భవిష్యత్ లో లీగల్ ఇష్యూస్ తలెత్తే ప్రమాదం ఉందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టులు చెప్తున్నరు.
కొత్త రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో లేఔట్ మ్యాప్ లేదు. ప్రాపర్టీ లొకేషన్ గుర్తించే సర్వే నంబర్ ప్రస్తావన కూడా లేదు. స్కెచ్ మ్యాప్ లేకుంటే సరిహద్దుల వివాదం తలెత్తే ప్రమాదం ఉంది.