
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో 17035 / 17036 ఖాజీపేట-– బల్లార్షా, బల్లార్షా – ఖాజీపేట ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగి పునరుద్ధరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్– కరీంనగర్– ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకా కుటుంబ సభ్యులు ప్రజలతో మమేకమై కావలసిన సౌకర్యాలు అభివృద్ధి పనులు నెరవేస్తున్నందుకు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నవి. ఈ రైలు 90వ దశకం ముందు చాలా సంవత్సరాలపాటు హైదరాబాద్– నాగపూర్ ప్యాసింజర్‌గా నడిచేది. ఆ తర్వాత ఖాజీపేట– నాగపూర్- అజ్నీ మధ్య నడిపారు.
ఈ రైలును అజ్ని ప్యాసింజర్‌గా పిలిచేవారు. ప్రస్తుతం కొలనూరు రైల్వేస్టేషన్లో ఈ రైలును ఆపకపోవడం వలన మూడు మండలాల్లోని దాదాపు 20కి పైగాగ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాల ప్రజలకు ఇటు విద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రమైన జమ్మికుంట.. విద్య, వైద్యాలకు నిలయమైన వరంగల్‌తో అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. చుట్టరికాలు, వ్యాపార వాణిజ్యంతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో ముడివడి ఉన్నది. నిత్యం ఈ గ్రామాల ప్రజలు కొలనూర్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు.
నిజాం కాలం నాటి నుంచి మహారాష్ట్ర నుంచి రాకపోకలు కొనసాగుతూ ఉంటున్నవి. ఈ రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చినప్పటి నుంగా కొలనూరు స్టేషన్లో నిలుపుదల చేయడం లేదు. ఫలితంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అధిక వ్యయ ప్రయాసలతో రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ రైలును కొలనూరు స్టేషన్లో నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇతర అధికారులకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ కూడా పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. ఈ ప్రాంతవాసుల కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైలును కొలనూర్ స్టేషన్ లో నిలుపుదల చేయుటకు పునః పరిశీలన చేయాలని ప్రజలు నిండు హృదయంతో విజ్ఞప్తి చేస్తున్నారు.
- దండంరాజు రాంచందర్ రావు,
అధ్యక్షుడు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్
వెల్ఫేర్ అసోసియేషన్