కులగణన ఓ గేమ్​చేంజర్​

కులగణన ఓ గేమ్​చేంజర్​

కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని  తెలంగాణ ప్రభుత్వం కులగణనను ‘గేమ్ చేంజర్’ అని భావిస్తోంది.  బడుగుల  బంగారు భవిష్యత్తుకు బాట అని ప్రకటిస్తున్నారు. అనేక పౌరసంస్థలు ఆహ్వానిస్తున్నాయి.  చాలా సంఘాలు అధిక జనాభాగల  కులాలు  అధికారంలో  లేకపోవడాన్ని నిరసిస్తూ,  ఈ రకమైన  గణన వల్ల నిజాలు తేటతేల్లమవుతాయి అని భావిస్తున్నాయి. అయితే, కులగణన అనంతరం అధికార మార్పిడి జరుగుతుందా?  ప్రభుత్వం చేపట్టే ‘అభివృద్ధి’ దిశ మారుతుందా?  అనేకమందికి ఈ తాజా ప్రభుత్వ సర్వే మీద చాలా ఆశలు ఉన్నాయి. అవన్నీ తీరుతాయని అనుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం బడుగుల అభివృద్ధి, సంక్షేమం మెరుగు అవుతాయని హామీ ఇస్తున్నారు.  కులగణన మీద ఆశలు వేరు,  ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు వేరు. ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉన్నది. 

మొదటి అడుగు పడకముందే కాంగ్రెస్ పార్టీ పది అడుగులు ముందుకు వెళ్లి దేశవ్యాప్తంగా కులగణనకు పిలుపునిచ్చింది.  తెలంగాణాలోనే  కులగణన  మొదలుపెడుతున్నామని ఆ పార్టీ చెబుతున్నది. అంటే ఇది పైలట్ ప్రాజెక్టు కాబోతు న్నది.  సామాజిక  న్యాయం  సాధించడంలో  రాజకీయ పార్టీలు ఏండ్లుగా మాటలకే  పరిమితమవుతున్న సందర్భంలో  కులగణన  ద్వారా  దానిని ఎట్లా సాధిస్తారో  వివరించే  ప్రయత్నం ఎవరూ చేయడం లేదు.  దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఒప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కులగణన  వల్ల  అంతరాన్ని ఎట్లా  తగ్గిస్తారో  వివరించడం లేదు.  

కులగణన  అనంతరం కులాల సంఖ్యను బట్టి రాజకీయ ప్రాతినిధ్యం పెంచే  అవకాశం  ఉందని భావించేవారు ఉన్నారు. అయితే, ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ధృవీకరించడం లేదు. ఎక్కడా ఈ ఉద్దేశం ఉన్నది  అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. రాజకీయ రిజర్వేషన్లకు కులగణన ఆధారం అవుతుంది అని హామీ ఎవరూ ఇవ్వలేదు.  కులగణనతో  ఆయా కులాల సంఖ్య బట్టబయలు అయినప్పుడు అటువంటి రిజర్వేషన్లకు ఒత్తిడి పెరగవచ్చు. జనాభా కంటే పదవులు ఎప్పుడైనా తక్కువగా ఉంటాయి. పోటీ ఎప్పుడూ ఉంటుంది.  సంఖ్యను బట్టి కులానికి ఇన్ని పదవులు,  కులానికి ఈ పదవి, ఒక కులానికి ఇచ్చే పదవికి నిర్దిష్ట కాలం నిర్ణయించే వ్యవస్థ ఏర్పడితేనే  కులగణనకు ఒక దిశ ఏర్పడుతుంది. 

పెట్టుబడి వస్తువుగా భూమి

దశాబ్దాల సామాజిక న్యాయ పోరాటం ఒక సర్వే వల్ల మాత్రమే ఫలితం సాధించే అవకాశాలు మన దేశంలో లేవు.  భారతదేశంలో ‘అభివృద్ధి’ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, విధానాలు అసమానతలను  పెంచి పోషిస్తున్నాయే  తప్పితే తగ్గించడం లేదు. అందరికీ చెందాల్సిన ప్రకృతి వనరులు కొందరికే చేరడం ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నది తప్పితే తగ్గడం లేదు.  ఆహారం అందించే భూమి క్రమంగా బడుగులకు దూరం అవుతున్నది.  భూమి మార్కెట్లో ఒక పెట్టుబడి వస్తువుగా మారిన దరిమిలా భూస్వాములు పెరుగుతున్నారు.  

భూమిని  నమ్ముకుని బతుకుతున్న అనేక గ్రామీణ కుటుంబాలు భూమికి ధర వచ్చిన మొదటి దశలోనే అమ్ముకునే  పరిస్థితి ప్రభుత్వాలు  కల్పించి  ‘సంపద’ సృష్టిని  కొందరికే  అనుకూలంగా మార్చే ప్రక్రియలు చేపడుతున్నాయి.  దేశమంతటా భూమికి ధరలు పెరిగినందున పల్లెలలో కూడా అనేక కుటుంబాలకు ఇంటి జాగా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.  పట్టణీకరణ ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వాలు పట్టణాలలో ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లకే  సొంత ఇండ్లు, జాగా అందుతున్నది. 90 శాతం ఇతరులకు సొంత ఇల్లు అందని కలగానే మిగులుతున్నది. 

రాజకీయ ప్రాతినిధ్యం కోసంకులసంఘాల ప్రయత్నాలు

చట్టసభలలో రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకోవాలని అనేక కుల సంఘాలు, సమాఖ్యలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, వారిలో ఉన్న అనైక్యత వల్ల ఇది సాధించలేకపోతున్నారని విశ్లేషకుల అభిప్రాయం. కులగణన వల్ల కుల జనాభా సంఖ్య  తేటతేల్లమయితే విభేదాలు ఇంకా పెరగవచ్చు.  తగ్గుతాయని  అనుకోవడం  పొరపాటు అవుతుంది.  ప్రభుత్వ  ఉద్యోగాల  రిజర్వేషన్లలో  వర్గీకరణ  అంశం రోజురోజూకు  వేళ్ళూనుకుంటున్న దశలో కులగణన ఆయా కులాల వర్గీకరణ ఆశలకు ఊతం కావచ్చు.  

అయితే, ఉద్యోగాలు, విద్యా సంస్థలలో  కుల సంఖ్య ఆధారంగా వర్గీకరణ జరగాలంటే కూడా విధి విధానాలు తయారుకావాలి. మొదటి దశ వర్గీకరణ మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నందున లోతుగా వర్గీకరణ ఎట్లా ఉండాలి అనే అంశం చర్చించడానికిరాజకీయ పక్షాలు,  ప్రభుత్వం సిద్ధంగా లేవు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ  రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం కొన్ని కులాలు ఏండ్లుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రాథమికంగా వర్గీకరణకు కొన్ని కులాలు సిద్ధంగా లేవు. ఆర్థిక స్తోమత పెంచుకునేందుకు అవకాశాలు బడుగులకు కులగణన ద్వారా పెరగవు.  అభివృద్ధిక్రమంలో,  సంక్షేమంలో మార్పుల ద్వారా అవకాశాలు పెరుగుతాయి తప్పితే ఒక కులంలో  కుటుంబాల సంఖ్య తేల్చినంత మాత్రాన పెరగవు.

ప్రభుత్వం దగ్గర పొంతన లేని లెక్కలు

చేనేత కుటుంబాల గణన ఎప్పటి నుంచో చేస్తున్నారు. వ్యవసాయం మీద, రైతుల మీద సమాచార  సేకరణ  జరుగుతున్నది.  కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి,  రాష్ట్రంలో  రైతుబంధు వగైరా పథకాల కోసం కోట్ల కుటుంబాల సమాచారం డేటా బేస్  ప్రభుత్వం దగ్గర ఉన్నది.  ఖచ్చితమైన విధానాలు, పథకాల అమలులో ఆశించిన మార్పులు మాత్రం రాలేదు.  చేనేత బడ్జెట్ గత పదేండ్లలో దేశం మొత్తానికి రూ.200 కోట్లు మించలేదు. ఒకప్పుడు 3 కోట్లు ఉన్న చేనేత కుటుంబాలు క్రమంగా పడిపోయి 45 లక్షలకు వచ్చిందని 4వ జాతీయ చేనేత గణన (2019–-20) నివేదిక చెప్పింది.  ఈ గణన ఆధారంగా అన్ని చేనేత  కుటుంబాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉండగా గుర్తించినవారికీ ఇవ్వలేదు.  పథకాలకు  ఇవ్వాల్సిన  నిధులు  తగ్గించుకోవటానికి  చేనేత జనాభా  సంఖ్య తగ్గించారు. ప్రభుత్వం దగ్గర ఉన్న పొంతన లేని లెక్కలకు స్వతంత్ర సమీక్ష లేనందున ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతున్నది. 

తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం

పశువుల గణన, జనాభా గణనలో కూడా లోపభూయిష్ట సమాచార సేకరణ వల్ల అనేక పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  కులగణన శాస్త్రీయంగా ఉంటుందా?  మోయలేనంత అప్పుల భారం ఉన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి పథకం అమలులో ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నది.  కుల గణన.. సమాచారం, డేటా అందిస్తుంది.  దాని ఆధారంగా తయారు చేయవలసిన విధానాలు, పథకాలు, కార్యక్రమాలు శాసనసభలో చర్చించి, ప్రజలతో సంప్రదింపులు చేసిన తరువాత మాత్రమే అమలులోకి తెస్తామని  ప్రభుత్వం ప్రకటిస్తే ప్రజలలో  విశ్వాసం పెరుగుతుంది. 

సామాజిక న్యాయం,  ప్రభుత్వ నిధుల సద్వినియోగం, అణగారినవర్గాల  ప్రయోజనాలకు ప్రాధాన్యత వంటి లక్ష్యాలు తెలంగాణ  ప్రభుత్వం చేరుకోవాలంటే.. పారదర్శక పాలన, అవినీతి నిర్మూలన  ద్వారా  మాత్రమే సాధ్యం.  ప్రజలకు సంబంధించిన సమాచారం అధికార పార్టీకి  వరంగా కాకూడదు.  డేటా వల్ల ఒనగూరే  ఖచ్చితత్వం పాలనలో మార్పుకు  ఉపయోగిస్తే  మంచిది.  కుల గణన ఓట్ల విపణిలో సరుకుగా మారిస్తే  మాత్రం సామాజిక న్యాయం దక్కదు.

సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగకరంగా డేటా

జనాభా గణన,  ప్రత్యేకంగా కులగణన, ద్వారా వచ్చే ఖచ్చితమైన డేటా తగిన విధాన రూపకల్పనకు ఉపయోగపడుతుంది.  అదేవిధంగా వనరుల కేటాయింపు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి,  సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుంది.  ప్రభావవంతమైన విధానాలు తయారు చేయటానికి,  సమర్థవంతంగా అమలు చేయటానికి, సున్నితమైన అంశాలపై హేతుబద్ధమైన చర్చలను సులభతరం చేయడానికి వీలు కల్పిస్తుంది. రిజర్వేషన్ ప్రణాళిక  తయారు చేయటానికి, ప్రభావవంతమైన రిజర్వేషన్ విధానాలను రూపొందించటానికి, నిర్దిష్ట చర్యలు చేపట్టటానికి ఖచ్చితమైన అవగాహన కులగణన ద్వారా సాధ్యం అంటారు. 

సామాజిక అసమానతలు తగ్గించడం, వివక్షను రూపుమాపడం, వివాదాలను పరిష్కరించడానికి కులగణన చాలా ముఖ్యమైనది. ఇంకా అనేక ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. అయితే, పాలనలో వేళ్ళూనుకున్న అవినీతి వల్ల, అసమర్థత వల్ల పైన చెప్పిన ప్రయోజనాలు ఇతర ఒత్తిడుల వల్ల ప్రజలకు చేకూరడం లేదు.  తెలంగాణా ప్రభుత్వం చేసిన 2016లో  ఒకేరోజు జరిపిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు ఇప్పటివరకు  బహిరంగపరచలేదు.