- కులగణనతో కొత్త బాటలు వేస్తాం
- రాజ్యంగ పరిరక్షణే మా సిద్ధాంతం
- అగ్నివీర్‌తో యువత బొటనవేలు తెంచారు
- భారతంలో ద్రోణుడిలాగే వ్యవహరిస్తుండ్రు
- రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తారా..?
- మతానికి వ్యతిరేకంగా మరో మతాన్ని ఉసిగొల్పాలని రాజ్యాంగంలో ఎక్కడుందో నాకు చూపించండి
- సావర్కర్ గురించి ప్రశ్నిస్తే నన్ను దోషి అంటుండ్రు
- లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభించాలన్నదే తమ అభిమతమని, అందుకే కులగణనలో కొత్త బాటలు వేస్తామని 50 శాతం రిజర్వేషన్ అనే గోడను బద్దలు కొడతామని రాహుల్ గాంధీ అన్నారు. జనాభా ప్రాతిపదికన అందరికీ అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఇవాళ రాజ్యాంగంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. దేశం కోసం రాజ్యాంగమని అన్నారు. ఎందరో మహానుభావుల ఆలోచనలో రూపుదిద్దుకున్నదే రాజ్యాంగమని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ఇండియా కూటమి పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని తెరిస్తే.. అంబేద్కర్, గాంధీ, నెహ్రూల ఆకాంక్షలు, ఆలోచనలు మనకు కనిపిస్తాయన్నారు.
ALSO READ | దేశంలో అనేకమంది యువతది ఏకలవ్యుడి పరిస్థితే: రాహుల్ గాంధీ
ఎన్డీఏ పాలనలో ఆర్థిక, సామాజిక సమానత్వాలు లేకుండా పోయాయని అన్నారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, రైతులు, శ్రామికుల బొటన వేళ్లు ఎవరు కత్తిరిస్తున్నారో చూపించాలనుకున్నామని చెప్తూ మహాభారతంలోని ద్రోణాచార్యుడి పాత్రను గుర్తు చేశారు. అప్పటి కుల వివక్షను ప్రస్తావించారు. ‘ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు విలువిద్య నేర్పమని వెళ్లాడు. నువ్వు మా జాతివాడివి కాదని ఏకలవ్యుడ్ని వెనక్కి పంపాడు. ద్రోణుడి ప్రతిరూపంతో ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడు. ద్రోణుడు కోరితే తన బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చాడు.’అని అన్నారు. ద్రోణుడి మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా యువత బొటన వేలిని కత్తిరిస్తోందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు.
కనీస మద్దతు ధర కోసం నిరసన తెలిపేందుకు ఢిల్లీ వస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని, అదానీ, అంబానీలను అందలం ఎక్కిస్తున్న మీరు రైతుల బొటన వేలు తెంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయ ముద్రతో కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం బొటన వేళ్లను తెంచేస్తోందని అన్నారు. ఇదే ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య ఉన్న తేడా అని పేర్కొన్నారు. మీరు ఎక్కడికి వెళ్లినా.. ఒక మతంతో మరొక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వెదజల్లుతారని, అలా వ్యవహరించాలని రాజ్యాంగంలో ఎక్కడుందో చూపాలని డిమాండ్ చేశారు. సావర్కర్ గురించి ప్రశ్నిస్తే తనను దోషిగా చూస్తున్నారని అన్నారు. అనేకమంది మేధావుల లోచనలకు ప్రతిరూపం మన రాజ్యాంగమని దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు.