తోటి కార్యకర్తలు తిట్టారని.. కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

  • ఫ్లెక్సీలో ఫొటో పెట్టకపోవడంపై ప్రశ్నించిన బాధితుడు  
  • దూషించడంతో సూసైడ్​ అటెంప్ట్​ 
  • పెట్రోల్ ​పోసుకుని నిప్పు అంటించుకోవడంతో గాయాలు

 మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆరో వార్డులో ఆదివారం నిర్వహిస్తున్న ముత్యాలమ్మ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్​ ఫ్లెక్సీలో తన ఫొటో, పేరు లేదని ఆ పార్టీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు, సెల్ఫీ వీడియోతో బాధితుడు వెల్లడించిన వివరాల ప్రకారం..ఇందిరమ్మ కాలనీ లే అవుట్​–2 లో తేజావత్ భగవాన్ ఆరేండ్లుగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తున్నప్పటికీ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనేది భగవాన్​ ప్రధాన ఆరోపణ. 

ముత్యాలమ్మ పండుగ వేళ కాలనీలోని గుడి దగ్గర తన ఫొటోను ఫ్లెక్సీలో ఎందుకు పెట్టలేదని శనివారం రాత్రి అదే కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశ్నించగా వారు నోటికి వచ్చినట్టు తిట్టారు. ‘నువ్వో పెద్ద లీడర్​వా.. నీ ఫొటో ఫ్లెక్సీలో పెట్టం...ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అని అనడంతో  మనస్తాపానికి గురయ్యాడు. ముత్యాలమ్మ గుడి సమీపంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భగవాన్​ తీవ్రంగా గాయపడగా స్థానికులు అతడిని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్​కు తరలించారు. తాను ఆత్మహత్యాయత్నం చేసేందుకు కారణమైన కొమర్రాజు నాగరాజు, రేబెల్లి సైదులు, మునుకుంట్ల కృష్ణతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితుడు వీడియోలో కోరాడు.