కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకోవద్దంటూ.. యువకుడి ఆత్మహత్యాయత్నం

ధర్మసాగర్, వెలుగు : కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడియం శ్రీహరి దళిత ద్రోహి అని, అతడిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ జన పోరాట సమితి వ్యవస్థాపకుడు బొడ్డు భరత్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్మసాగర్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా బొడ్డు భరత్ మాట్లాడుతూ కడియం శ్రీహరి దళితులను ఎదగనివ్వకుండా అణగదొక్కుతూ వచ్చి, ఎదురువచ్చిన వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పించకూడదని సీఎం రేవంత్​రెడ్డికి విజ్ఞప్తి చేశారు. భరత్ మాట్లాడుతుండగానే జన పోరాట సమితి సభ్యుడు దార విజయ్ కాంత్ పెట్రోల్ బాటిల్ పట్టుకొని కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని చస్తానని హెచ్చరించాడు. దీంతో మీటింగ్​లో ఉద్రిక్తత నెలకొంది. మిగతా సభ్యులు అడ్డుకొని పెట్రోల్ బాటిల్ లాక్కోవడంతో ముప్పు తప్పింది.