చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ ఇంటితో పాటు, హైదరాబాద్ లోని సోమాజిగూడలోని నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఐదున్నర నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంచిర్యాలలో వివేక్ అనుచరుల ఇళ్లలనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివేక్ ఇంటి దగ్గర మంచిర్యాల జిల్లా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
ఐటీ సోదాలు, పోలీసుల తనిఖీలపై కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సోదాలకు వ్యతిరేకంగా మంచిర్యాలలోని వివేక్ ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. కావాలనే తమపై కుట్ర చేస్తున్నారు ఆరోపించారు. ఓటమి భయంతోనే ఐటీ, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులు, తనిఖీలతో భయపెట్టే కుట్ర చేస్తున్నారని కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కేవలం కాంగ్రెస్ నేతల ఇండ్లలోనే ఐటీ దాడులు చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చెన్నూరులో అలజడి సృష్టించేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ కు ఆదరణ చూసి తట్టుకోలేక సోదాలు చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు కార్యకర్తలు. చెన్నూరులో వివేక్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్ర చేస్తున్నాయని మండిపడుతున్నారు.