- ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్
ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలకు గాను కాంగ్రెస్ ఎనిమిది సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన సీపీఐ ఒక స్థానంలో విజయం సాధించింది. బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది.
కొన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ఫలితాలు ఉంటాయని అంచనా ఉండగా, ఓటర్ల తీర్పు మాత్రం ఏకపక్షంగా వచ్చింది. గెలిచిన అభ్యర్థులంతా గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్
ఖమ్మం జిల్లాలో ఐదుకు ఐదు సీట్లను కాంగ్రెస్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ లో కోరుకున్న పాలేరు టికెట్ దగ్గకపోవడంతో కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అనుకోని పరిస్థితుల్లో ఖమ్మం నుంచి బరిలోకి దిగారు. అనూహ్యంగా ఆయన ఖమ్మం నుంచి పోటీ చేసినా రూ.35వేలకు పైగా ఓట్ల మెజార్టీతో పువ్వాడ అజయ్ కుమార్ పై విజయం సాధించారు.
.మధ్యలో ఒకటి రెండు రౌండ్లు తప్పించి మొదటి రౌండ్ నుంచి చివరి వరకు ఆధిక్యత కొనసాగింది. పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై కాంగ్రెస్ క్యాండిడేట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ విజయం సాధించారు. మొదటిరౌండ్ నుంచి చివరివరకు మెజార్టీ పెంచుకొని 50వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుపై 35వేల ఓట్ల తేడాతో గెలిచారు. భట్టి గెలిచిన నాలుగు ఎన్నికల్లోనూ ఆయన ప్రత్యర్థిగా కమల్ రాజునే ఉన్నారు. గతంలో ఓడిన సానుభూతి ఈసారి కమల్ రాజుకు వర్కవుట్ అవుతుందని ముందుగా అనుకున్నా.. గతానికంటే భారీ మెజార్టీతో భట్టి విన్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భట్టికి సీఎం అయ్యే చాన్స్ ఉందన్న ప్రచారం ఆయనకు కలిసి వచ్చిందని భావిస్తున్నారు. ఇక సత్తుపల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి గెలిచారు. వైరాలో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ నాయక్ విజయం సాధించారు.
బీఆర్ఎస్ ఒక్క సీటుకే పరిమితం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గానూ కాంగ్రెస్, మిత్రపక్షాలు నాలుగు నియోజకవర్గాల్లో విజయ కేతనం ఎగురవేశాయి. బీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ మద్దతుతో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు.
భద్రాచలంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ తెల్లం వెంకట్రావ్ గెలిచారు. ఇల్లెందు నుంచి సీపీఐ, టీడీపీ, టీజేఎస్ మద్ధతుతో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఇల్లెందు బీఆర్ఎస్ క్యాండిడేట్ భానోత్ హరిప్రియపై కోరం 55,718 ఓట్లతో గెలిచారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావుపై కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు 34,506ఓట్ల మెజార్టీ సాధించారు.
అశ్వారావుపేట బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 28,905ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, ప్రజాపంథా మద్దతుతో పోటీ చేసిన సీపీఐ క్యాండిడేట్, ఆ పార్టీ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు తన ప్రత్యర్థి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ క్యాండిడేట్(బీఆర్ఎస్ రెబల్), మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌పై 26,547ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన తెల్లం వెంకట్రావ్ 5,719 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు.
ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి..
ఉమ్మడి జిల్లాలో పలువురు నేతలు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. పాలేరు సెగ్మెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఖమ్మం లోక్ సభ సభ్యుడిగా గెలిచిన ఆయన తర్వాతి పరిణామాల్లో బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఈసారి కాంగ్రెస్ లో చేరి పాలేరు నుంచి భారీ విజయం సాధించారు. ఇక సత్తుపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మట్టా రాగమయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ఇదే మొదటిసారి.
ఆమె భర్త మట్టా దయానంద్ 2014 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. పొంగులేటి వెంట ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరగా, 2018 ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ రాలేదు. ఈసారి ముందుగానే కాంగ్రెస్ లో చేరిన ఆయన, ఎస్సీ సర్టిఫికెట్ ఇష్యూ అడ్డురావడంతో భార్య రాగమయికి టికెట్ తెచ్చుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ఇప్పటికే సత్తుపల్లి నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్యపై రాగమయి భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
వైరా కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ఇక ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలవడం ఇప్పుడే ఫస్ట్. 2014 ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీచేసి ఆయన ఓడిపోయారు. పొంగులేటి వెంట బీఆర్ఎస్ లో చేరిన ఆయన 2018 ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓటమి చెందారు.
ఆర్నెళ్ల క్రితం పొంగులేటి వెంట కాంగ్రెస్ లో చేరినా, అక్కడ టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్ లో చేరి బీఫామ్ తెచ్చుకున్నారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై గెలిచి అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. అశ్వారావుపేటలో కాంగ్రెస్ తరపున గెలిచిన జారే ఆదినారాయణ కూడా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.