
- నిర్వహణ కోసం ప్రత్యేక ఇన్ చార్జిల నియామకం
నిర్మల్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల ప్రచారం కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొత్త మార్గాలు ఎంచుకున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా సోషల్ మీడియాను తమ ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో సోషల్ మీడియా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం బీజేపీకి చెందిన సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జి నిర్మల్ జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో చేపట్టే ప్రచారంపై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు కూడా నియోజకవర్గ స్థాయిలో కొంతమంది యూత్ కార్యకర్తలకు సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మూడు నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ఇన్చార్జిలను సైతం నియమించినట్లు సమాచారం.
వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రచారం
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పట్టణాలు, గ్రామాల్లోనూ సోషల్ మీడియా ఇన్చార్జీలను నియమించుకుంటున్నాయి. సోషల్ మీడియాతో పాటు రాజకీయ అంశాలు, పార్టీ విధానాలపైనా అవగాహన ఉన్న వారిని ఇన్‌చార్జీలుగా ఎంచుకుంటున్నాయి. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు, యూత్ క్లబ్‌లు, కుల సంఘాలు, అభివృద్ధి కమిటీలను లక్ష్యంగా చేసుకొని మొదట వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేస్తున్నారు. ఈ గ్రూపుల్లో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చుకొని వారికి ప్రతిరోజూ తమ పార్టీ కార్యకలాపాలతోపాటు ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను మెసేజ్‌ల ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నవారు పబ్లిసిటీ చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ హైలైట్ చేస్తోంది. వాట్సప్‌తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను కూడా వేదికగా చేసుకొని ప్రచారం మొదలుపెట్టాయి. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఆ తర్వాత పార్టీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా కాంగ్రెస్ లో చేరిపోతుండడంతో ఆ పార్టీ ప్రచారంలో పూర్తిగా వెనుకబడిపోయింది.
కొత్త యూట్యూబ్ ఛానల్స్
కాంగ్రెస్, బీజేపీ ప్రచారం కోసం ప్రత్యేకంగా మారు పేర్లతో యూట్యూబ్ ఛానళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. దేశభక్తి, సంస్కృతి సంప్రదాయాలు, జాతీయ భావాలు, చారిత్రక ప్రదేశాలు, కట్టడాల పేరిట బీజేపీ పార్టీ యూట్యూబ్ ఛానల్స్‌ను క్రియేట్ చేస్తోంది. వీటికి పెద్ద సంఖ్యలో సబ్స్క్రయిబర్లను తయారు చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సైతం జాతీయ సమైక్యత, చారిత్రక ఘట్టాల పేర్లు, అలాగే స్థానిక నాయకుల అభిమాన సంఘాల పేరిట యూట్యూబ్ ఛానల్స్‌ను క్రియేట్ చేస్తోంది.
స్థానికంగా క్రియేట్ అవుతున్న ఈ యూ ట్యూబ్ ఛానళ్లను ఎక్కువ మంది చూసేలా చేయడమే ఈ రెండు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వరకు తమ పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యూట్యూబ్ ఛానళ్లతోపాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను అస్త్రాలుగా మలుచుకోబోతున్నాయి.