కాంగ్రెస్​తో బీజేపీ కలిసిపోయింది

  • వాళ్లు రేవంత్​కు వ్యూహకర్తలుగా పనిచేస్తున్నరు: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీజేపీ నేతలు కాంగ్రెస్​ నేతలతో కలిసి పనిచేస్తున్నారని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీపై ఆయన స్పందిస్తూ గురువారం ట్వీట్​ చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డికి వ్యూహకర్తలుగా రాష్ట్ర బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినా  బీజేపీ నుంచి ఒక్కరూ నోరుమెదపరు. రేవంత్​మీద ఈగవాలకుండా కాపాడుకుంటారు. హైడ్రా మంచిదంటారు. మూసీ కావాలంటారు. ఏమైనా అంటే నిద్ర అంటూ నటిస్తారు. పిల్లలు చనిపోయినా.. రైతు గుండె పగిలినా.. గిరిజనులను చెరబట్టినా చప్పట్లు కొడతారు. రాష్ట్రంలో కాంగ్రెస్​చేతిలోనే కమలం జాగ్రత్తగా, భద్రంగా ఉంది’’ అని కేటీఆర్ తన ట్వీట్​లో పేర్కొన్నారు. 

దేనికి రైతు పండగలు..?

రైతు పండుగలు దేనికి చేస్తున్నారో చెప్పాలని సర్కారును కేటీఆర్ ప్రశ్నించారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టారని విమర్శించారు. దిలావర్​పూర్​, రామన్నపేటల్లో దమనకాండను సృష్టించి.. లగచర్ల రైతులను జైలుకు పంపి అల్లుడి కళ్లలో ఆనందం చూసినందుకు రైతు పండుగలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. పండుగలు కాంగ్రెస్​ నేతలకు.. పస్తులు రైతులకా అన్నారు.  రైతును నిండా ముంచి వ్యవసాయాన్ని ఆగం చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా అని నిలదీశారు. స్టూడెంట్లకు పురుగుల అన్నం పెట్టడమేంటని ప్రశ్నిస్తే బీఆర్ఎస్వీ నేతలపై కేసులు పెట్టి రాత్రంతా జాడ చెప్పకుండా ఎక్కడెక్కడో తిప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.