
వరంగల్, వెలుగు : కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వరంగల్ పర్యటన కంటే ముందే ప్రధాని నరేంద్ర మోడీతో ప్రకటన చేయించాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ డిమాండ్ చేశారు. హనుమకొండ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఆదివారం గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో కాంగ్రెస్, బీజేపీలు వరంగల్‌కు ద్రోహం చేశాయన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ పోరాటం వల్లే వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీ వచ్చిందని, కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. జిల్లా పర్యటనలో కిషన్‌రెడ్డి అసత్యాలు చెప్పారన్నారు. అరూరి రమేశ్ మాట్లాడుతూ కేంద్రం కావాలనే రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో రైతు రుణ విమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, గ్రంథాలయ చైర్మన్ అజీజ్‌ఖాన్ పాల్గొన్నారు.