- బీఆర్ఎస్కు గుండు సున్నా.. 8 చోట్ల డిపాజిట్ గల్లంతు
- ఫస్ట్ టైమ్ లోక్‌సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం కరువు
- 14 చోట్ల థర్డ్ ప్లేస్‌లో ఆగిన కారు.. మరో చోట ఫోర్త్ ప్లేస్
- నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌కు 5,59,905 రికార్డు మెజార్టీ
- పెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణకు 1,31,364 మెజార్టీ
- ఆరు సీట్లలో లక్షకుపైగా మెజార్టీ సాధించిన కాంగ్రెస్
- అందులో తొలిసారి పోటీలోకి దిగినవాళ్లే ఐదుగురు
- మెదక్‌లో ఆది నుంచీ బీజేపీ, కాంగ్రెస్,
- బీఆర్ఎస్ మధ్య దోబూచులాడిన గెలుపు
- చివరికి రఘునందన్ రావు గెలుపు.. కాంగ్రెస్‌కు సెకండ్ ప్లేస్
- మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి మధ్య టఫ్ ఫైట్
- 4,500 మెజార్టీతో గట్టెక్కిన డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నడుమ హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల పోరులో చివరికి ఆ రెండు పార్టీలు చెరోసగం సీట్లను దక్కించుకున్నాయి. కాంగ్రెస్ ఎనిమిది చోట్ల, బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు సీట్లలో గెలువగా.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అదనంగా ఐదు సీట్లు యాడ్ అయ్యాయి. బీజేపీకి సీట్లు డబుల్ అయ్యాయి. పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్కు ఇప్పుడు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఏ స్థానంలోనూ ప్రభావం చూపించలేకపోయింది. 14 స్థానాల్లో మూడో ప్లేస్‌కు పరిమితమైంది. హైదరాబాద్ సెగ్మెంట్లో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది.
బీఆర్ఎస్(టీఆర్ఎస్) పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం దక్కకపోవడం ఇదే ఫస్ట్ టైమ్. హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎం నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ లక్షకుపైగా మెజారిటీని సాధించింది. అత్యధికంగా నల్గొండ నియోజకవర్గంలో 5.59 లక్షల మెజారిటీ వచ్చింది.
కాంగ్రెస్ ఖాతాలోకి రికార్డులు
అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. నల్గొండ, పెద్దపల్లి, వరంగల్, భువనగిరి, మహబూబాబాద్, జహీరాబాద్, ఖమ్మం, నాగర్‌కర్నూల్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ నియోజకవర్గం నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి బంపర్ మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై విజయ ఢంకా మోగించారు. రికార్డ్ స్థాయిలో 5,59,905 ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. రఘువీర్ రెడ్డికి 7,84,337 ఓట్లు పడగా.. సైదిరెడ్డికి కేవలం 2,24,432 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన కంచర్ల కృష్ణారెడ్డికి 2,18,417 ఓట్లు పడ్డాయి. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4,67,847 మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి 7,66,929 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు 2,99,082 మంది ఓటేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వినోద్ రావు 1,18,636 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
వరంగల్ సీటును కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కైవసం చేసుకున్నారు. అక్కడ బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆరూరి రమేశ్‌పై ఆమె 2,20,339 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కావ్యకు 5,81,294 ఓట్లు పోలవగా.. రమేశ్‌కు 3,60,955 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మారపల్లి సుధీర్ కుమార్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి 6,29,143 ఓట్లు పోలవగా.. బూర నర్సయ్య గౌడ్‌కు 4,06,973 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్కు 2,56,187 ఓట్లు మాత్రమే వచ్చాయి. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితపై 3,49,165 ఓట్ల బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు 6,12,774 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్కు 2,63,609 ఓట్లే పోలయ్యాయి. బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో నిలిచింది.
జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 46,188 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 5,28,418 ఓట్లు పోలవగా.. బీజేపీకి 4,82,230 మంది ఓటేశారు.
బీజేపీకి మరో నాలుగు యాడ్
బీజేపీ తన సిట్టింగ్ సీట్లతోపాటు మరో నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ సిట్టింగ్ సీట్లతో పాటు మెదక్, చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ స్థానాల్లో గెలుపొందింది.
కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బండి సంజయ్.. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 2,25,209 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంజయ్‌కి 5,85,116 ఓట్లు పడగా.. రాజేందర్ రావుకు 3,59,907 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కేవలం 2,82,163 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ సిట్టింగ్సీటైన మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై ఆయన 3,91,475 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీజేపీకి ఇక్కడ 9,91,042 ఓట్లు పడగా.. కాంగ్రెస్‌కు 5,99,567 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై బీజేపీ అభ్యర్థి గోడెం నగేశ్ 90,652 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ నగేశ్‌కు 5,68,168 ఓట్లు పడగా.. సుగుణకు 4,77,516 ఓట్లు పోలయ్యాయి. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 1,72,897 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 8,09,882 ఓట్లు పడగా.. రంజిత్ రెడ్డికి 6,36,985 ఓట్లు పోలయ్యాయి. నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఆయన 1,09,241 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీకి 5,92,318 ఓట్లు పడగా.. కాంగ్రెస్‌కు 4,83,077 ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానాన్నీ బీజేపీ నిలుపుకున్నది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 49,944 ఓట్లతో గెలుపొందారు. ఆయనకు 4,73,012 ఓట్లు పడగా.. దానం నాగేందర్‌కు 4,23,068 ఓట్లు పడ్డాయి. పద్మారావు గౌడ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
మహబూబ్‌నగర్‌లో టఫ్ ఫైట్
మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై 4,500 స్వల్ప మెజార్టీతో ఆమె గెలుపొందారు. డీకే అరుణకు 5,10,747 ఓట్లు పడగా.. వంశీచంద్ రెడ్డికి 5,06,247 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి మధ్యే పోరు సాగింది. విజయం చివరి వరకు స్వల్ప మెజార్టీలతో దోబూచులాడింది. చివరికి డీకే అరుణ గెలిచారు. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ తప్పదన్న అంచనాలూ నిజమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ సెగ్మెంట్‌పై మరింత ఫోకస్ పడింది. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన మన్నె శ్రీనివాస్ రెడ్డికి 1,54,792 ఓట్లే పడ్డాయి.
మెదక్‌లో దోబూచులాడిన గెలుపు
మెదక్‌లో ఆది నుంచి గెలుపు దోబూచులాడింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీల మధ్య మెజార్టీ చేతులు మారుతూ వచ్చింది. తొలుత బీఆర్ఎస్ లీడ్‌లో ఉండగా.. ఆ తర్వాత బీజేపీ ముందంజ వేసింది. పలు రౌండ్ల దాకా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ సాగింది. చివరికి బీజేపీఅభ్యర్థి రఘునందన్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రఘునందన్‌కు 4,71,217 ఓట్లు పోలవగా.. నీలం మధుకు 4,32,078 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
థర్డ్ ప్లేస్‌కు ఆర్ఎస్ ప్రవీణ్
నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి.. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌పై 94,414 ఓట్లతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 4,65,072 ఓట్లు పడగా.. బీజేపీకి 3,70,658 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3,21,343 ఓట్లతో మూడో ప్లేస్‌కు పడిపోయారు.
గడ్డం వంశీకృష్ణ ఫస్ట్ అటెంప్ట్‌లోనే..
పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గడ్డం వంశీ కృష్ణ .. తన తొలి ప్రయత్నంలోనే లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌పై వంశీకృష్ణ 1,31,364 మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజక వర్గంలో వంశీకృష్ణకు 4,75,587 మంది ఓటేశారు. బీజేపీకి 3,44,223 ఓట్లు పడ్డాయి. ఈ సిట్టింగ్ సీట్లో బీఆర్ఎస్ చతికిలపడింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థికి పెద్దపల్లిలో కేవలం 1,93,356 ఓట్లు పడ్డాయి.
ఆరింట్లో కాంగ్రెస్‌కు బంపర్ మెజారిటీ
కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లోని ఆరు చోట్ల బంపర్ మెజారిటీని సాధించింది. ఆయా నియోజకవర్గాల్లో లక్షకుపైగా ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది. ఈ ఆరింటిలో ఐదు నియోజకవర్గాల్లో పోటీకి దిగినవాళ్లు కొత్తవాళ్లే. పొలిటికల్ కెరీర్లో తొలిసారి బరిలోకి దిగిన రఘువీర్ రెడ్డి (నల్గొండ) 5,59,905, రఘురామరెడ్డి(ఖమ్మం) 4,67,847, చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి) 2,22,170, కడియం కావ్య (వరంగల్) 2,20,339, వంశీ కృష్ణ (పెద్దపల్లి) 1,31,364 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులపై విజయం సాధించారు. మహబూబాబాద్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాం నాయక్ 3,49,165 ఓట్ల మెజార్టీని కైవసం చేసుకున్నారు.