హోరాహోరీ ప్రచారం

హోరాహోరీ ప్రచారం
  • దూసుకుపోతున్న కాంగ్రెస్​, బీజేపీ
  • ఓటర్లను నేరుగా కలుస్తున్న శ్రేణులు
  •  వాయిస్ మెసేజీలు.. డైరెక్ట్​ కాల్స్​​ 

నిజామాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండడంతో ప్రచారం జోరందుకుంది. బీజేపీ తరపున టీచర్స్ స్థానానికి మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి పోటీ చేస్తుండగా ఆ పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థల నేతలు ప్రచారంలో తలమునకలయ్యారు. గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీగా కాంగ్రెస్​పార్టీ నుంచి అల్ఫోర్స్​నరేందర్​రెడ్డి పోటీలో ఉన్నారు. పీసీసీ ఆయన గెలుపును సవాల్​గా తీసుకుంది. పార్టీ సీనియర్లకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్​ నాయకత్వం పార్టీ శ్రేణులన్నింటినీ గ్రౌండ్​లోకి దింపింది. ఈ ఎన్నికలకు బీఆర్​ఎస్​ దూరంగా ఉంది. 

రెండు ప్రధాన పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. క్షేత్రస్థాయి కార్యకర్తలు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతిఓటరును నేరుగా కలిసి తమ అభ్యర్థికే మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కోరుతున్నారు. దీనికి తోడు సోషల్​ మీడియా ద్వారా కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వాట్స్​అప్, ఫేస్​బుక్​లలో పోస్టులు కుమ్మేస్తున్నారు. ఓటర్లకు వాయిస్​ మెసేజీలు పంపుతున్నారు. ప్రధానపార్టీలతో పాటు కొందరు ఇండిపెండెంట్​ అభ్యర్థుల తరఫున ఓటర్లకు ఫొన్లు చేసి ఓటడుతున్నారు. ఒక్కోరోజు 20, 30 కాల్స్​వస్తుండడంతో ఓటర్లు చిరాకు పడుతున్నారు. 

జోరుమీదున్న కాంగ్రెస్ 

నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్​ఎమ్మెల్సీ స్థానం నిలబెట్టుకోవడాన్ని కాంగ్రెస్ చాలెంజ్​గా తీసుకుంది. టీపీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​ సొంత జిల్లా కావడంతో లీడర్లంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో రాజకీయ పరిణామాలు కాంగ్రెస్​ అనుకూలంగా మారాయి. 

56 వేల ఉద్యోగాల భర్తీ చేయడం లాంటి అంశాలు కలిసివస్తాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు త్వరలో జరిగే లోకల్​బాడీ ఎలక్షన్స్​పై ప్రభావం చూపనుండడంతో కిందిస్థాయి నుంచి పార్టీ శ్రేణులను ప్రచారంలోకి దింపారు. 20 మంది ఓటర్లకు ఒకరిని ఇంచార్జిగా నియమించారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రెండుసార్లు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి గ్రాడ్యుయేట్స్​తో వరుసగా మీటింగ్​లు నిర్వహించారు. యూత్​ కాంగ్రెస్​, ఎన్​ఎస్​యూఐ లీడర్లు చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. 

25 మందికి ఒక ఇన్​చార్జ్​

నిజామాబాద్​ జిల్లాలో ఓటు హక్కు ఉన్న టీచర్స్​ 3,751, గ్రాడ్యుయేట్​ ఓటర్లు 31,574 మంది ఉన్నారు. ప్రతి 25 మంది ఓటర్లకు బీజేపీ ఒక్కో ఇన్​చార్జిని నియమించింది. ఇప్పటికే గ్రామస్థాయి వరకు ఇన్​చార్జిలతో మీటింగులు పూర్తి చేశారు. ప్రతి ఓటరును ఇన్​చార్జీలు కలిసేలా ప్లాన్​చేశారు. ఎంపీ అరవింద్​, ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి క్యాడర్​కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులు మల్క కొమురయ్య, అంజిరెడ్డి జిల్లాలో ఇప్పటికే ఐదుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు.