లొట్టపీసు..  భలే ట్రెండింగ్!

లొట్టపీసు..  భలే ట్రెండింగ్!
  • ఫార్ములా-ఈ రేస్​ కేసుతో నేతల నోట్లో నానుతున్న పదం
  • నెట్​లో సెర్చ్​ చేస్తున్న జనం

భూపాలపల్లి/గండిపేట్, వెలుగు: లొట్టపీసు.. ఈ పదం ఇప్పుడు ట్రెండింగ్​లో ఉన్నది. ఫార్ములా-–ఈ రేస్​ కేసు పుణ్యమా అని ఇప్పుడు తెలంగాణలో ఏ నేతను కదిలించినా ఈ పదమే వినిపిస్తున్నది. ‘ఇదో లొట్టపీసు కేసు’ అని కేటీఆర్​, హరీశ్​ రావు, ఇతర బీఆర్ఎస్​ నేతలు అంటుంటే .. ‘అది లొట్టపీసు కేసైనప్పుడు ఎదుర్కోకుండా కొట్టేయమంటూ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ’ అని కాంగ్రెస్, బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే, నాలుగై దు రోజులుగా నేతల మధ్య నలుగుతున్న ఈ లొట్టపీసు చెట్టు కథేంటో తెలుసుకునేందుకు జనం నెట్​లో సెర్చ్​ చేస్తున్నారు.

లొట్టపీసు చెట్టు ప్రత్యేకతలెన్నో.. 

‘కాన్​వాల్వ్’ ఫ్యామిలీకి చెందిన ఈ లొట్టపీసు చెట్లను ఇంగ్లిష్​లో మార్నింగ్ గ్లోరీ (ఉదయించే గులాబీ) అంటారు. దీని శాస్త్రీయ నామం ‘ఐపోమి యా కార్నియా’. ఈ మొక్క కాండం తెల్లని పూతతో లొట్ట(బోలు) మాదిరి ఉండడం వల్ల దీనికి లొట్ట పీసు చెట్టు అనే పేరు వచ్చింది. మన రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వీటి కాండం విరిస్తే విరగకుండా రబ్బర్​లా సాగుతుంది కనుక రబ్బర్​ చెట్లు అని, వీటిని తింటే వెర్రి లేస్తుంది గనుక పిచ్చిచెట్లు అని, ఆకులను, కాండాన్ని గిల్లితే పాలలాంటి ద్రవం వస్తుంది కనుక పాల చెట్లు అని  పిలుస్తారు.

కొన్ని చోట్ల పాలసముద్రం చెట్లు అని కూడా అంటారు. ఇవి చెరువులు, వాగులు, కాల్వల గట్ల వెంట విరివిగా పెరుగుతాయి. ఈ చెట్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎండిపోయిన చెట్ల కర్రలను  నేలపైన పడేస్తే చాలు నీరు తగలగానే నాటుకొని చిగురిస్తాయి. ఈ చెట్ల పువ్వులు ఉమ్మెత్త చెట్ల పువ్వుల్లాగా ఉంటాయి. ఆకులను విరిస్తే పాలు వస్తాయి. 

ఉపయోగాలివే..

గతంలో  రైతన్నలు లొట్టపీసు చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టి.. గో మూత్రంతో కలిపి సేంద్రియ ఎరువులా ఉపయోగించేవాళ్లు. వీటి ఆకులను నీడలో ఆరబెట్టి, నిప్పులపైన పొగలాగా వేసి దోమలను పారదోలేవారు. ఆయుర్వేద చికిత్సలో పైపూత ఔషధంగా లొట్టపీసు ఆకులను వాడేవారు. తేలు కాటుకు మందులా ఉపయోగించేవారు. తామరలాంటి చర్మవ్యాధులకు సైతం ఈ చెట్లు దివ్యౌషధం. పూర్వకాలంలో పల్లెల్లో ఈ కట్టెలతో దడి చేసి.. పశువులకు రక్షణ  గోడగా కట్టుకునేవారు. బెండ్లులేని టైంలో లొట్టపీసు కట్టెలను వీపునకు కట్టుకొని ఈత నేర్చుకునేవారని పెద్దలు చెబుతారు.