
- 16 స్థానాల్లో ముందున్న టీడీపీ
- 14 చోట్ల నితీశ్ సారథ్యంలోని జేడీయూ గెలుపు
- మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు
- ఎన్డీఏ కూటమికి ఉన్నది 294
- ఇండియా కూటమికి 232
- అరకొర మెజార్టీతోనే నడవనున్నసర్కారు
- కీలక బిల్లులు పాసవటం కష్టమే
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాల వేళ దేశం చూపంతా ఇప్పుడు ఇద్దరు కీలక నేతలపై పడింది. వాళ్లలో ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరో నేత బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్. ప్రస్తుతం పార్లమెంటులో 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఇందులో 272 సీట్లు సాధించిన కూటమి అధికారంలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 294 పార్లమెంటు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. వీటిలో కొన్నింటిలో ఇప్పటికే విజయం సాధించింది. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న టీడీపీకి ఏపీలో 16 సీట్లు వచ్చాయి. అదే కూటమిలోని జేడీయూ 14 సీట్లు సాధించబోతోంది.
అంటే వీళ్లిద్దరి బలమే 30 సీట్లు. 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. ఈ సారి బీజేపీ చతికిల పడింది. 294 సీట్లకు అటు ఇటుగా వచ్చే పరిస్థితి నెలకొంది. ఇందులో టీడీపీ, జేడీయూ బలం 30 సీట్లు ఒక వేళ ఈ రెండు పార్టీలు ఏదైనా తేడా చేస్తే ఎన్డీఏ బలం 260 సీట్లుగా ఉంటుంది. అంటే సర్కారు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. పార్లమెంటులో బిల్లులు పాస్ కావాలంటే తప్పకుండా టీడీపీ, జేడీయూ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఇప్పుడు దేశంలోని అందరి చూపు టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పై పడింది.