న్యాయ పత్ర వర్సెస్ సంకల్ప పత్ర

 న్యాయ పత్ర వర్సెస్ సంకల్ప పత్ర

18వ లోక్​సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  రెండు జాతీయ పార్టీల్లో అధికార బీజేపీ సంకల్ప పత్ర పేరుతో,  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్ర పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. 24 ప్రధాన అంశాలతో మోదీ గ్యారంటీ,  వికసిత్ భారత్ థీమ్​తో  బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. పంచ న్యాయ పేరుతో  పచ్చీస్​ గ్యారంటీలతో  కాంగ్రెస్ తన మేనిఫెస్టోని ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టోలో నారి, అన్నదాత, యువత,  గరీబ్ లాంటి  నాలుగు వర్గాలపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కిసాన్, నారి, యువ, శ్రామిక్, హిస్సేదారి (అట్టడుగు వర్గాలు) లాంటి ఐదు వర్గాల సంక్షేమంపై దృష్టి సారించింది.  77 సంవత్సరాల స్వాతంత్ర్య  భారతదేశంలో అభివృద్ధి, వికాసం కొన్ని వర్గాలకే పరిమితమైన విషయాన్ని మనం గమనించాలి.  

కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టో  దేశంలోని ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం రూపొందించినట్లుగా స్పష్టమౌతోంది.  దేశంలో లక్షిత  వర్గాల అభ్యున్నతి కోసం రూపొందించినట్లుగా చూడాలి. అందుకే బీజేపీ మేనిఫెస్టో  కంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు స్పష్టంగా ఉండటమే కాదు,  కింది వర్గాలు అంటే అట్టడుగు వర్గాల విస్తృత ప్రయోజనాలు కాపాడేవిధంగా ఉన్నాయని చెప్పాలి.  కాంగ్రెస్ పార్టీ పంచ్ న్యాయ పేరుతో కొత్త హామీలను ప్రజల ముందుకు తెస్తుంటే బీజేపీ మాత్రం గత పది ఏండ్లుగా తాము అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలకి కొనసాగింపుగా కొత్త హామీలు లేకుండా రూపొందించింది.

 బీజేపీ మేనిఫెస్టోలో  దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన  రైతాంగ సమస్యలు, ధరల పెరుగుదల,  నిరుద్యోగం, అసమానతలు లాంటి సమస్యలకు పరిష్కారాలు మేనిఫెస్టోలో  పొందుపరచకపోవడం కాసింత వెలితిగా కనిపిస్తోంది. అయితే,  రైతాంగం, మహిళలు, యువత విషయంలో బీజేపీ మేనిఫెస్టో కంటే కాంగ్రెస్ పార్టీ  గ్యారంటీలు మెరుగైనవిగా కనిపిస్తున్నాయి.  రైతాంగం తాము  పండించిన పంటలకి కనీస మద్దతు ధరకి (ఎంఎస్పీ) చట్టబద్ధత  కల్పించాలనే ఉద్యమాలు చేస్తున్నాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో  పంటలకి మద్దతు ధరలు పెంచుతామనే హామీ ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామనే స్పష్టమైన హామీ ఇచ్చింది.  రైతాంగం విషయంలో బీజేపీ హామీల కంటే కాంగ్రెస్ గ్యారంటీలు స్పష్టంగా ఉన్నాయని భావించాలి. 

మహిళలకు కాంగ్రెస్​ వరాలు

మహిళల విషయంలో కూడా బీజేపీ హామీ కంటే కాంగ్రెస్ గ్యారంటీలు స్పష్టంగా ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని,  ప్రతి పేద మహిళలకు  సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామనే హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బీజేపీ మాత్రం మూడు కోట్ల మహిళలను కోటీశ్వరులను చేస్తామని  ప్రధానమంత్రి ఉజ్వల యోజన, టాయిలెట్స్, ఇంద్రధనస్సు లాంటి హామీలతో సరిపెట్టిందనే చెప్పాలి  అలాగే యువత విషయంలో  కూడా 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఐదు వందల కోట్ల రూపాయలతో అంకుర పరిశ్రమల కోసం  కార్పస్ ఫండ్ పెడతామని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ తెలియజేస్తోంది. బీజేపీ ఇస్తున్న ముద్ర  యోజన స్కిల్ ట్రైనింగ్, పేపర్ లీకేజీ  నియంత్రణకు చట్టంలాంటి హామీల కంటే మెరుగైనవిగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల  భర్తీకి  ప్రాధాన్యత ఇస్తామనే గ్యారంటీ  బీజేపీ యువతకి ఇస్తున్న హామీల కంటే మెరుగైనదిగా కనిపిస్తున్నది. 

పేదలకు మోదీ గ్యారంటీ 

పేదల జీవితాలు ఉన్నతంగా మార్చడమే మోదీ గ్యారంటీ అని బీజేపీ నాయకులు చెపుతున్నారు. ఎన్డీఎ  ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, చర్యల వలన ఈ పదేండ్ల కాలంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినారని బీజేపీ చెబుతున్నది.  కానీ,  బీజేపీ  తన మేనిఫెస్టోలో  పేదల కోసం  ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్, అన్న యోజన లాంటి ఉచిత బియ్యం పథకాన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలాంటి పథకం ద్వారా మరొక మూడు కోట్ల ఇండ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది.

 దేశంలో ఏ వర్గాలు పేదరికంలో మగ్గుతున్నాయో తెలుసుకోవటానికి కులగణన,  నైపుణ్యం లేని గ్రామీణ పేదలకి ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకి 400 రూపాయల కనీస వేతనం లాంటి గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ  ప్రతిపాదించింది. బీజేపీ హామీగా ఇస్తున్న ఉచిత రేషన్, పేదలకు ఇండ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్, ముద్ర రుణాలు, జన్ ధన్ యోజన ఖాతాలు, కిసాన్ సమ్మాన్ యోజన, పీఎం సూర్య ఘర్ లాంటి పథకాల కంటే మెరుగైన పథకాలు ఆయా రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. రాజస్థాన్​లో గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్​లో  లాడ్లీ బెహన్ పథకం ద్వారా మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్న బీజేపీ సర్కారు.. ఈ పథకాలను తన జాతీయ మేనిఫెస్టోలో ఎందుకు పొందుపరచలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మెజార్టీ ప్రజలకే దేశ సంపద 

మేనిఫెస్టోలు రాజకీయ పార్టీల గెలుపునకు సహకరిస్తాయి.  కానీ, మేనిఫెస్టోలే గెలిపించలేవు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బలంగా ఉన్నా,  పార్టీగా దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాల దృష్ట్యా బలహీనంగా ఉంది. అలాగే బీజేపీ మేనిఫెస్టో బలహీనంగా ఉన్నా పార్టీగా రాజకీయ సమీకరణాలలో బలంగా ఉంది.  దేశాన్ని విశ్వ బంధుగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపాలని సంపన్న భారత నిర్మాణం జరగాలనే బీజేపీ సంకల్పం గొప్పదే.  కానీ,  దేశంలోని మెజార్టీ ప్రజలకి దేశ సంపద చెందటమే న్యాయం. సంపన్న భారత్ కంటే సంక్షేమ భారతం విస్తృత ప్రయోజనార్థం కలది.

 బీజేపీ మేనిఫెస్టో  దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం రూపొందించినట్లుగా ఉంటే  కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు మాత్రం దేశంలోని ప్రజల కోసం,  సమానత్వం కోసం,  సామాజిక న్యాయం కోసం రూపొందించినట్లుగా కనిపిస్తున్నది. ఆర్థిక అభివృద్ధికి ప్రామాణికమైన స్థూల సంతోష సూచీలో భారత్ 126వ స్థానం నుంచి తన ర్యాంకుని మెరుగుపరుచుకుంటేనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది. అదే నిజమైన అభివృద్ధి. అట్లాంటి ప్రణాళికలు, మేనిఫెస్టోలతో,  గ్యారంటీలతో పార్టీలు ప్రజల ముందుకు రావాలని ఆశిద్దాం.

- డాక్టర్ తిరునాహరి శేషు, పొలిటికల్​ ఎనలిస్ట్,​ కాకతీయ యూనివర్సిటి