డబ్బులున్న వారికే కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ టికెట్లు

సిరిసిల్ల టౌన్  వెలుగు : ప్రజలకు సేవచేసే వారికి కాకుండా డబ్బులు ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తున్నరని కాంగ్రెస్, బీజేపీపై ఉద్యమ నేత దరువు ఎల్లన్న మండిపడ్డారు. తనకు అన్యాయం జరిగినందువల్లే బీజేపీకి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీలో రెండేండ్లు కష్టపడితే ఎన్నికల సమయంలో తనను పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నక్కజిత్తుల వేషాలు వేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఫైర్  అయ్యరు. 

రెండు పార్టీలూ తనకు అన్యాయం చేశాయని వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో జీవితాలు పణంగా పెట్టి, జైలుకు వెళ్లిన విద్యార్థి నాయకులను ఎన్నికల వరకు వాడుకొని వారికి టికెట్  ఇవ్వకుండా అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులంతా ఏకమై ప్రజాక్షేత్రంలో మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణను అందరం కాపాడుకోవాలని కోరారు.

బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్న విద్యార్థి నాయకులు ఆలోచించి, ఉద్యమ పార్టీలకు మద్దతు తెలపాలని ఆయన సూచించారు.