- అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటిలో ఆరుచోట్ల కాంగ్రెస్ విజయం
- గెలుపుపై ధీమాతో హస్తంలో టిక్కెట్ ఫైటింగ్
- బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంక్.. కొత్తగా అయోధ్య జోష్
వరంగల్, వెలుగు: వరంగల్ పార్లమెంట్(ఎస్సీ) నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జోష్ కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింట ఆరు చోట్ల అనూహ్య విజయాలు సాధించిన ఆ పార్టీ ఎంపీ సీటును సైతం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో ఉంది. కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆ పార్టీ టికెట్‌కోసం ప్రయత్నిస్తున్నవాళ్ల సంఖ్య డబుల్ డిజిట్‌కు చేరింది. ఇక గడిచిన మూడు ఎన్నికల్లో రికార్డ్ స్థాయి విజయాలు అందుకున్న బీఆర్ఎస్, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఈసారి డీలా పడింది.
ఓటమి నుంచి ఆ పార్టీ నేతలు ఇంకా తేరుకోకపోవడం మైనస్‌గా మారింది. మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వని బీజేపీ ఈసారి కాన్ఫిడెంట్‍గా కనపడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండే గ్రేటర్ వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల స్థానాల్లో పుంజుకున్న ఆ పార్టీ జోష్ మీద ఉంది. ప్రధాని మోదీ చరిష్మా, అయోధ్య రామ మందిరం అంశం తమకు ప్లస్ అవుతాయని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు.
కాంగ్రెస్ టికెట్ కోసం పోటాపోటీ
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్టేషన్ ఘన్‌పూర్‌లో మాత్రమే బీఆర్ఎస్ గెలవగా, మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ క్రమంలో వరంగల్‍పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో ఈ స్థానం నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 15 మంది కాంగ్రెస్ లీడర్లు వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు. ప్రధానంగా గతంలో పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్యతో పాటు అద్దంకి దయాకర్, తాటికొండ రాజయ్య(ఇంకా పార్టీలో చేరలేదు), జన్ను పరంజ్యోతి, సర్వే సత్యనారాయణ, హరికోట్ల రవి, పోలీస్ ఆఫీసర్ శోభన్‍కుమార్, రామగల్ల పరమేశ్వర్, డాక్టర్ రామకృష్ణ లాంటి లీడర్లు తమ గాడ్ ఫాదర్ల సాయంతో టిక్కెట్ వేటలో ఉన్నారు.
బీఆర్ఎస్ లీడర్లు ఇంకా కోలుకోలే
మొదటి నుంచీ ఓరుగల్లును తమ కంచుకోటగా భావించిన బీఆర్ఎస్ పెద్దలకు డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆ షాక్ నుంచి పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ కోలుకోలేదు. బీఆర్ఎస్ నుంచి 2014లో కడియం శ్రీహరి, 2015 (బై ఎలక్షన్), 2019 ఎన్నికల్లో పసునూరి దయాకర్ గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ ఆ పార్టీ నేతల్లో చాలా మంది పోటీకి ఆసక్తి చూపడం లేదు. మూడోసారి తనకే అవకాశం వస్తుందని దయాకర్ భావిస్తున్నా.. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, కడియం కావ్య ఇతర ఉద్యమకారులు ఈ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యేలు పెద్దగా జనాల్లోకి రావడంలేదు. దీంతో నాలుగోసారి గెలుపుపై ఆ పార్టీ క్యాడర్లో నమ్మకం లేకుండా పోయింది.
పుంజుకున్న బీజేపీ
గతంతో పోలిస్తే వరంగల్ నియోజకవర్గంలో బీజేపీ పుంజుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో 3 నుంచి 4 వేలు ఓట్లు కూడా సాధించని ఆ పార్టీ అభ్యర్థులు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 30 వేల నుంచి 52 వేల వరకు ఓట్లు సాధించారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బీజేపీకి ఓటు బ్యాంక్ అనూహ్యంగా పెరిగింది. గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో బీజేపీకి కేవలం ఒక్కరే కార్పొరేటర్ ఉండగా.. రెండున్నరేండ్ల కింద జరిగిన ఎన్నికల్లో 10 మంది గెలిచారు. వరంగల్ తూర్పులో బీజేపీ క్యాండిడేట్ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ను కిందికి నెట్టి రెండోస్థానానికి చేరారు.
స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలకు ఫండ్స్ కేటాయించడం ద్వారా ఓరుగల్లు అభివృద్ధిలో తమకూ వాటా ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ వరంగల్ లో పర్యటించడమే కాకుండా ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, గిరిజన యూనివర్సిటీల మంజూరు చేశారు. 17 ఏండ్లుగా మూలనపడ్డ వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని పున: ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇవన్నీ బీజేపీ నేతలకు ప్రచారాస్త్రాలు కానున్నాయి. ప్రధాని మోడీ చరిష్మాకు తోడు.. అయోధ్య అంశం కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. మంద కృష్ణ మాదిగ, బీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
పొత్తుపై ఆశతో కమ్యూనిస్టులు..
కమ్యూనిస్ట్ పార్టీలు సొంతంగా క్యాండిడేట్‌ను నిలిపితే గెలిచే అవకాశం లేకున్నా.. పొత్తులో ఈ సీటు సంపాదించి బోణీ కొట్టాలని ఆశపడ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‍తో జతకట్టిన సీపీఐ.. ఈసారి వరంగల్ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని అడుగుతోంది. పొత్తులో భాగంగా సీపీఐకి సీటు దక్కితే పార్టీ దివంగత నేత భగవాన్‍దాస్ కొడుకు, సీనియర్ జర్నలిస్ట్ బీఆర్.లెనిన్‍కు టికెట్ ఇచ్చే అవకాశముంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోలైన ఓట్లివే..
నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ
వరంగల్ తూర్పు 67,757 42,783 52105
వర్ధన్నపేట 1,06,696 87,238 12,275
వరంగల్ పశ్చిమ 72,649 57,318 30,826
పరకాల 72,573 64,632 38,735
భూపాలపల్లి 1,23,116 70,417 14,731
స్టేషన్ ఘన్పూర్ 93,917 1,01,696 4,984
పాలకుర్తి 1,26,848 79,214 2,982
మొత్తం 6,63,556 5,03,298 1,56,638