అసెంబ్లీకి వెళ్లే మహిళలెందరో..! 16 మంది మహిళలు పోటీ

  • బీజేపీ నుంచి నలుగురు, బీఎస్పీ నుంచి ఒకరు బరిలోకి.. 
  • చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లుగా మరికొందరు..
  • ఇప్పటిదాకా ఉమ్మడి జిల్లాలో గెలిచింది ఐదుగురే.. 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 70ఏండ్లలో మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంది. మహిళలకు ఈసారి సీట్లు కేటాయించే విషయంలో బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ వెనకడుగు వేశాయి. 13 నియోజకవర్గాల్లో ఆ పార్టీ మహిళలకు నాలుగు స్థానాలు కేటాయించగా, బీఎస్పీ ఒకరికి ఇచ్చింది. ఈ ఐదుగురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఇస్తున్నారు. వీరిలో ఎందరు గెలిచి అసెంబ్లీకి వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ మహిళలకు ఒక్క టికెట్‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వలేదు. 

బీజేపీ, బీఎస్పీలే మహిళలకు సీట్లు 

ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున జగిత్యాల నుంచి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి,  చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రామగుండం నుంచి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సిరిసిల్ల నుంచి రాణిరుద్రమరెడ్డి పోటీ చేస్తున్నారు. వేములవాడ బీజేపీ టికెట్ తుల ఉమ తొలుత ఖరారైనప్పటికీ చివరి క్షణంలో బీఫాం దక్కలేదు. బీఎస్పీ పెద్దపల్లి అభ్యర్థిగా దాసరి ఉష బరిలో నిలిచారు

బీఆర్ఎస్ తరఫున జగిత్యాల మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన బోగ శ్రావణి.. తనను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తన పదవికి, పార్టీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆమెకు ఆ పార్టీ టికెట్​ఇచ్చింది. ఆమె ఇప్పుడు సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డితోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పోటీ పడుతున్నారు. 

చొప్పదండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో చొప్పదండి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చాక అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు. 2018 ఎన్నికల్లో ఆమెకు బీఆర్​ఎస్​ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేడిపల్లి సత్యంతో పోటీ పడుతున్నారు.  రామగుండం బీజేపీ అభ్యర్థిగా పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి పోటీలో నిలిచారు. ఆమె బీఆర్ఎస్ టికెట్ ఆశించగా దక్కకపోవడంతో ఇటీవల బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి టికెట్​  దక్కించుకున్నారు.  


సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా రాణిరుద్రమరెడ్డి పోటీ చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆమె బీజేపీ సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష నియోజకవర్గ రాజకీయాల్లో పెనుసంచలనంగా మారారు. ఖరగ్‌‌‌‌‌‌‌‌పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తండ్రి రిక్షా కార్మికుడు, తల్లి భవన నిర్మాణ కూలీ. రెండేళ్లుగా పద్మ హనుమయ్య ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నారు.  

వీరితోపాటు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పిరమిడ్ పార్టీ నుంచి నర్మద, ఇండిపెండెంట్లుగా గువ్వల లక్ష్మి, గొర్రె తార, ధర్మపురి నుంచి గల్ఫ్ మృతుడి భార్య బూత్కూరి కాంత(ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్), రామగుండంలో శ్యామల అరవింద్(అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్),  వేములవాడలో అనుగూరి రజిత(ఇండిపెండెంట్), మానకొండూరులో తోడేటి పవిత్ర(సోషలిస్టు పార్టీ), భోగి పద్మ(ఆల్ ఇండియా  ఎంపర్ మెంట్ పార్టీ),  హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో మాధవరాణి(ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌), జగిత్యాలలో రమాదేవి(డెమొక్రటిక్ రిఫార్మ్ పార్టీ), చిట్టి శ్యామల (ఇండిపెండెంట్) పోటీలో ఉన్నారు. 

ఏడు దశాబ్దాల్లో ఐదుగురే.. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన మహిళలు కేవలం ఐదుగురే. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు కాగా, ఒకరు ఎంపీగా గెలిచారు. శాసనసభకు తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల ద్విసభ నియోజకవర్గం నుంచి జేఎం రాజమణిదేవి పీడీఎఫ్ పార్టీ నుంచి గెలుపొందారు. 1972లో అప్పటి నుస్తులాపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున ప్రేమలతాదేవి గెలిచారు. 1998లో కాంగ్రెస్ తరఫున ఉపఎన్నికల్లో మెట్ పల్లి నుంచి కొమిరెడ్డి జ్యోతి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన బొడిగె శోభ తొలుత శంకరపట్నం జడ్పీటీసీగా పని చేసి, 2014లో చొప్పదండి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. పెద్దపల్లి లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానం నుంచి1998లో బై ఎలక్షన్ లో ఒకసారి, 1999 జనరల్ ఎలక్షన్ లో మరోసారి చల్మెడ సుగుణ కుమారి గెలిచారు.