- తులం బంగారం హామీ ఏమైందన్న ఎమ్మెల్యే
- పదేండ్లలో మీరేం చేశారని ప్రశ్నించిన కాంగ్రెస్ లీడర్లు
బాల్కొండ, వెలుగు : నిజామాబాద్ జిల్లా బాల్కొండ పరిధిలోని వేల్పూర్ లో బుధవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ , బీఆర్ ఎస్ లీడర్లు ఘర్షణ పడ్డారు. చెక్కుల పంపిణీకి హాజరైన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ‘తులం బంగారం’ విషయం ప్రస్తావించడం గొడవకు కారణమైంది. ‘ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన తులం బంగారం హామీ నెరవేర్చకుండా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చి రూ. లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు’ అని వేముల అనడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. గొడవ జరుగుతుండగానే ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. తర్వాత తులం బంగారం ఇచ్చేలా కాంగ్రెస్ సర్కార్ ఒత్తిడి తేవాలని పలువురు మహిళలు నాయకులతో వాగ్వాదానికి దిగారు.
మూసీతో ఎకరమైనా పారుతుందా ?
పేదలకు అందాల్సిన పథకాలను ఎగ్గొట్టి రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేయడం వెనుక మర్మం ఏంటని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగపూట పేదల ఇండ్లు కూల్చి మూసీ ప్రక్షాళనకు తెర లేపడం ఏంటని, మూసీతో ఎకరం భూమి అయినా పారుతుందా ?
అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కాంగ్రెస్ హామీలు నెరవేరలేదన్నారు. తులం బంగారం స్కీమ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు రూ. 2,500, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ , ఆ పథకాలను ఇప్పటికీ అమలుచేయడం లేదన్నారు. వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి పాల్గొన్నారు.