గువ్వల వర్సెస్​ వంశీకృష్ణ

గువ్వల వర్సెస్​ వంశీకృష్ణ
  • అచ్చంపేటలో ఉద్రిక్తత
  • హాజీపూర్​లో మీటింగ్, ర్యాలీలకు ఇద్దరు లీడర్ల ఏర్పాట్లు 
  • పర్మిషన్​ లేదని బాలరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పీఎస్ ​ముందు కార్యక్తల ధర్నా

నాగర్ కర్నూల్, వెలుగు : అచ్చంపేట నియోజకవర్గంలో సోమవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నిర్వహించతలపెట్టిన సమావేశాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. వంశీకృష్ణ సోమవారం హాజీపూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్నారు. దీనికి పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. మరోవైపు అచ్చంపేటలో మీటింగ్, ర్యాలీ నిర్వహిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు హైదరాబాద్​నుంచి బయలుదేరారు.

దీంతో ఆయన అనుచరులు.. గువ్వలకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు హాజీపూర్ చౌరస్తాకు తరలిరావాలంటూ సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. హాజీపూర్ ​నుంచి అచ్చంపేట వరకు బైక్ ర్యాలీ ఉంటుందని ప్రకటించారు. దీంతో గొడవ జరగడానికి ఆస్కారం ఉంటుందని పోలీసులు అలర్టయ్యారు. అక్కడికి వెళ్తే గువ్వలపై దాడి జరిగే అవకాశం ఉంటుందన్న సమాచారంతో అచ్చంపేటకు వెళ్తున్న బాలరాజును వెల్దండ దగ్గరే ఆపేశారు.

ఆయనను పోలీస్​ స్టేషన్​కు తరలించి మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచారు. బాలరాజును అక్రమంగా అరెస్ట్​ చేశారంటూ ఆ పార్టీ కార్యకర్తలు పోలీస్​స్టేషన్​ ఎదుట ధర్నాకు దిగారు. చివరకు సాయంత్రం 4 గంటలకు గువ్వలను వదిలేశారు. దీంతో ఆయన హైదరాబాద్​ వెళ్లిపోయారు.