పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన రెబల్స్ ఒక్కటవుతున్నారు. రెండు పార్టీల్లో నిన్నటి వరకు టికెట్ ఆశించి బంగపడ్డ నాయకులంతా రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి ఐదుగురి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశించినా, రాలేదు.
ఈ క్రమంలో ఆ పార్టీలకు చెందిన ఆశావహులంతా ఒక్కటై ఎవరినో ఒక్కరిని పోటీలో నిలపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల బలోపేతానికి దశాబ్దాలుగా పార్టీ కోసం సేవలు చేస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొదట బీజేపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ అడుగుతామని, ఒకవేళ అక్కడ రాకపోతే, ఐక్యవేదిక అభ్యర్థిని ఇండిపెండెంట్‌గా పోటీలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఐక్యవేదిక అభ్యర్థులను గుర్తించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఓటు బ్యాంకు అధికంగా ఉన్న సామాజిక వర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఎన్నికల్లో తమకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆయా రెబల్ అభ్యర్థులను కలవాలని ప్రయత్నించినా, కలిసేది లేదని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. రెబల్స్ స్వతంత్రంగా బరిలోకి దిగితే, వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.