న్యూఢిల్లీ: ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధాన మంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ(పీఎంఎంఎల్) సొసైటీగా కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నెహ్రూ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు ఆయన వారసత్వాన్ని చెరిపేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ బుధవారం ట్విట్టర్లో ఫైర్ అయ్యారు.
నెహ్రూ వారసత్వ ఆనవాళ్లను చెరిపేసేందుకు ఎన్ని నిరంతర ప్రయత్నాలు జరిగినా.. ఆయన పేరు ప్రఖ్యాతలు ఎన్ని తరాలైనా ప్రపంచమంతా నిలిచిపోతాయన్నారు. ‘‘నెహ్రూ మ్యూజియం పేరులో ఎన్ అనే అక్షరాన్ని తీసేసి, పీ అనే అక్షరాన్ని పెట్టారు. కానీ పీ అంటే నిజానికి పెట్టీనెస్ (చిన్నతనం), పీవ్ (చిరాకు పుట్టించేది) అని అర్థం చేసుకోవాలి” అంటూ విమర్శించారు. నెహ్రూ సేవలను ప్రధాని ఎన్న టికీ తీసిపారేయలేరని పేర్కొన్నారు.