
- లేదంటే ఈ రెడ్లు అడ్డుకునే వారే: కాంగ్రెస్ నేత అంజన్ కుమార్
- అప్పుడు తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకుండా అడ్డుకున్నది వీళ్లేనని కామెంట్
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భజన మండళ్లు ఎక్కువయ్యాయని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలమేరకే రాష్ట్రంలో కుల గణన సాధ్యమైందని, లేకుంటే రెడ్డి సామాజిక వర్గం నేతలు కులగణన చేసే వారే కాదని మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. కులగణన సర్వే పూర్తి చేసినందున రాహుల్ కు, సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపేందుకు సోమవారం ఆదర్శనగర్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో యాదవుల సమావేశాన్ని అంజన్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా ఓ ఇద్దరు రెడ్డి వర్గం నేతలు అడ్డుకున్నారని, చివరకు లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యం చేసుకొని సోనియా గాంధీకి చెప్పడంతోనే ఆ పదవి తనకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో భజన సంఘాలు ఎక్కువయ్యాయని, ఇక నుంచి అన్ని పదవుల్లో యాదవులకు తగిన ప్రాధాన్యత లేకుంటే ఊరుకునేదే లేదన్నారు. పార్టీలో రేవంత్ కు కష్టకాలం ఉన్న సమయంలో ఆయనకు అండగా నిలిచిందే యాదవులన్నారు. హైదరాబాద్‌లోని యాదవులు రేవంత్ వెంట ఉండడంవల్లే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందని చెప్పారు.
రాజ్యసభ సీటు యాదవులదే అయినందున తన కొడుకు అనిల్ కుమార్ కు అది అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చిందని, లేకపోతే అదికూడా ఇచ్చేవారే కాదన్నారు. యూపీఏ హయాంలో తనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకున్నది కూడా ఈ రెడ్లేనని ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వీళ్లు ఎంపీగా పోటీ చేస్తారు.. కానీ మనకు మాత్రం ఆ అవకాశం రాకుండా అడ్డుకుంటారు.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్ రెడ్డికి మళ్లీ ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..’ అని ప్రశ్నించారు. పక్క పార్టీ నేతను (దానం నాగేందర్ ను) తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారని, ఇంట్లో కూర్చున్న ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడం వల్లే సికింద్రాబాద్ సీటును కాంగ్రెస్ కోల్పోయిందని అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. అంతకు ముందు పార్టీ ఓడిపోయే సమయంలో తనకు టికెట్ ఇచ్చారని, ఈసారి తనకు టికెట్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ గెలిచేదని చెప్పారు.