కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కామారెడ్డి సభలో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ ఇతర పార్టీలు ప్రకటించిన డిక్లరేషన్ కంటే కొంత మెరుగైన స్థితిలో ఉంది. ఎందుకంటే ప్రస్తుత అధికార బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ప్రకటించిన పలు సంక్షేమ పథకాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రకటించిన అంశాలు ఉన్నాయి. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. డిక్లరేషన్‌లో ఉన్న అంశాల సాధ్యాసాధ్యాలను కూడా మనం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోనే కులగణన చేస్తామని, దాని ఆధారంగా రిజర్వేషన్లు కూడా పెంచుతామని ప్రకటించింది.
ప్రస్తుతం కులగణన దేశానికి అత్యంత అవసరమైనటువంటి ఒక గుణాత్మక ప్రక్రియ. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, సంఘాలు కులగణనపై కేంద్ర ప్రభుత్వాన్ని పలు విధాలుగా ఒత్తిడి చేస్తున్నాయి. కర్నాటక రాష్ట్రంలో కూడా కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా కులగణన చేస్తామని ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం కులగణన చేయాలని గతంలోనే అసెంబ్లీలో సూత్రప్రాయంగా ప్రతిపాదించినా అది అమలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేస్తామని చెప్పడం స్వాగతించాలి.
ర్యాంకు నిబంధన లేకుండాఫీజు రీయింబర్స్మెంట్
ప్రధానంగా బీసీ విద్యార్థులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఉన్నత విద్యలో పూర్తిస్థాయి ఉపకార వేతనాలు రాకపోవడం. ప్రతి బీసీ విద్యార్థికి ఎటువంటి ర్యాంకు నిబంధన లేకుండా పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్మెంట్అందిస్తామని పేర్కొనడం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ప్రస్తుతం కేవలం పదివేల ర్యాంకు లోపు ఉన్న బీసీ విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్మెంట్వస్తుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూడా ఆర్థికసాయం అందుతున్నప్పటికీ, మనరాష్ట్రంలో పలు వృత్తి విద్యకోర్సులను చదువుతున్నవారందరికీ పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్‌మెంట్ రావడం లేదు.
ర్యాంకు నిబంధన లేకుండా పూర్తిస్థాయి ఫీజులను చెల్లిస్తే బీసీ విద్యార్థులు ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ నిధుల కింద సంవత్సరానికి కేవలం వందల సంఖ్యలోనే బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కాగా, ఈ పథకం కింద ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌లో పొందుపరచాలి. అదేవిధంగా సంచార, అత్యంత వెనుకబడిన వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైన హామీలు కూడా ఇవ్వాలి.
మన రాష్ట్రంలో ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీగా, బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లాంటి సానుకూల అంశాలు బీజేపీకి అనుకూలిస్తున్నవి. అయితే, బలమైన బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో దించడంలో బీజేపీ కొంత వెనుకంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ హస్తం పార్టీ ప్రకటించిన ప్రధానమైన అంశాలు బీసీలకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఈ ఎన్నికలు బీసీలకు సంబంధించి కీలకంగా మారాయి. బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి పలు పార్టీలు ప్రకటించిన డిక్లరేషన్లు కూడా గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి.
బీసీ రిజర్వేషన్లు 42శాతానికి..
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి దోహదపడతాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో అమలు చేస్తున్న 23 శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతామని, దీని ద్వారా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం అధికంగా దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇది స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సాధికారతకు కూడా ఉపయోగపడనుంది. అదేవిధంగా విద్యారంగంలో ప్రతి మండలానికి ఒక గురుకులం, జిల్లాకు ఒక డిగ్రీ కళాశాల ప్రకటించడం హర్షణీయం.
బీసీ యువతకు వడ్డీలేని రుణాలు
బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్నవిధంగా బీసీ యువకులకు వడ్డీ లేకుండా రూ.10 లక్షల లోన్ ఇవ్వడం వల్ల.. బీసీ వర్గాలకు చెందిన యువత ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గౌడ్లకు 25 శాతం కోటా వైన్ షాపుల్లో కేటాయించడం, బీసీ ఏలోకి ముదిరాజు, ముత్రాసి, తెనుగు, సామాజిక వర్గాలను మారుస్తామని చెప్పడం, వృత్తి బజార్ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని, నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, రజకులు, కమ్మరి, స్వర్ణకారులు వంటి చేతివృత్తుల వారికి కూడా ఉచితంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
ALSO READ : యువతను కేసీఆర్ మోసం చేసిండు : వంశీకృష్ణ
50ఏండ్ల గీత, చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛను వర్తింపజేశామని, బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదు అయిన ప్రతి సొసైటీకి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఫెడరేషన్లకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తామని కూడా పేర్కొన్నది. బీసీ సంక్షేమానికి ఐదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో ప్రతి సంవత్సరం రూ. 20,000 కోట్లను అందజేస్తామని తెలిపింది.
-డాక్టర్ కందగట్ల శ్రవణ్ కుమార్ సామాజిక కార్యకర్త