ప్రతి మహిళకు నెలకు 2 వేలు.. హర్యానాలో కాంగ్రెస్ హామీ

ప్రతి మహిళకు నెలకు 2 వేలు.. హర్యానాలో కాంగ్రెస్ హామీ
  • ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టో

న్యూఢిల్లీ: హర్యానాలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, ఓబీసీ క్రీమిలేయర్ లిమిట్ ను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బుధవారం ఢిల్లీలో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, హర్యానా పీసీసీ చీఫ్ ఉదయ్ భాను విడుదల చేశారు. మొత్తం ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందించింది. 18 నుంచి 60 ఏండ్లు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం అందజేస్తామని.. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది.

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపింది. యువతకు 2 లక్షల జాబ్స్ ఇస్తామని, హర్యానాను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామని చెప్పింది. పేదలకు 100 గజాల ప్లాట్ ఇస్తామని, రూ.3.5 లక్షలతో రెండు రూమ్ ల ఇండ్లను నిర్మించి ఇస్తామని వెల్లడించింది. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని, పంట నష్టపరిహారం వెంటవెంటనే చెల్లిస్తామని ప్రకటించింది.

తప్పకుండా అమలు చేస్తం: ఖర్గే 
అధికారంలోకి వస్తే తాము ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. అందుకే తమ మేనిఫెస్టోకు ‘ఏడు హామీలు.. పక్కాగా అమలు’ అనే పేరు పెట్టామని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని పీసీసీ చీఫ్ ఉదయ్ భాను అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత లాఅండ్ ఆర్డర్ ను పక్కాగా అమలు చేస్తామని, హర్యానాను మళ్లీ  అన్నింట్లో నెంబర్ వన్ స్టేట్ చేస్తామని చెప్పారు. కాగా, హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.