- ఓటమిని అంగీకరించబోమన్న కాంగ్రెస్
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తాము అంగీకరించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. రిజల్ట్స్ తమను షాక్‌కు గురి చేశాయని చెప్పింది. ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. ఉదయం నుంచే రిజల్ట్స్ ప్రకటించడంలో ఈసీ అధికారులు తీవ్ర జాప్యం చేశారని ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది.
ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య ఈసీ వెబ్‌సైట్‌లో ఫలితాల అప్‌డేట్ లేదని తెలిపింది. ఫలితాల వెల్లడి మందకొడిగా సాగిందని లేఖలో పేర్కొన్నది. వెబ్‌సైట్‌ను వాస్తవమైన, కచ్చితమైన గణాంకాలతో అప్‌డేట్ చేయాలంటూ తమ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. దీనివల్ల ఫేక్ న్యూస్ నివారించొచ్చని తెలిపింది. కాగా, ఓట్ల లెక్కింపుపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కొందరు అభ్యర్థుల ఫలితాలు ఈసీ వెబ్‌సైట్‌లో కంటే ముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని విమర్శించారు.
గెలుపును తారుమారు చేశారు: జైరామ్ రమేశ్
హర్యానా ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హర్యానా రిజల్ట్స్ చూసి ఆశ్చర్యమ నిపిస్తున్నది. ఫలితాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. హర్యానా జనం మార్పుతో పాటు సుస్థిర, పారదర్శక పాలన కోరుకున్నారు. కానీ.. ఫలితాలు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. కౌంటింగ్‌పై అనుమానాలు ఉన్నాయి. ఫలితాలు వెంటవెంటనే విడుదల చేయలేదు.
ఆలస్యానికి కారణమేంటో చెప్పాలి. ఈ ఫలితాలను మేము అంగీకరించబోం. బీజేపీ ట్యాంపరింగ్ చేసింది. కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడింది. విజయాన్ని తారుమారు చేసింది. ఇది పారదర్శక, ప్రజాస్వామ్య ఓటమి. హర్యానా ఫలితాలపై మేం పోరాడుతాం’’అని జైరామ్ రమేశ్ అన్నారు.