ఆరు గ్యారెంటీ కార్డులు కాదు.. 60 ఇచ్చినా ఉత్తవే: వద్దిరాజు రవిచంద్ర

  • అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లే
  • కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
  • మంత్రి అజయ్ జీవో 58, 59 కింద పట్టాలు పంపిణీ చేసిన నేతలు

ఖమ్మం, వెలుగు:  తెలంగాణలో  కాంగ్రెస్  పార్టీ ఆరు గ్యారెంటీ కార్డులు అమలు చేస్తామని చెబుతున్నారని అలాంటి 60  హామీలు ఇచ్చినా ఏమీ కాదని అవి అన్నీ ఉత్తుత్తివేనని ఎంపీ రవిచంద్ర, మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  మంగళవారం ఖమ్మంలోని  భక్త రామదాసు కళాక్షేత్రంలో జీవో 58, 59  కింద 221 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ..  ఇళ్లు లేని పేదలు ఉండకూడదనే ప్రభుత్వం జీవో 58, 59ను విడుదల చేసిందన్నారు. 

Also Read : కోర్టు జడ్జీలను దూషించిన కేసులో.. మీడియాకు నోటీసులు

బీఆర్ఎస్​ పార్టీలో బాగుపడిన వాళ్లు, అభివృద్ధి చెందిన కొందరు ఇప్పుడు వచ్చి మాయమాటలు చెబుతారని, అలాంటి  వారిని అస్సలు నమ్మొద్దన్నారు.  కేసీఆర్‌‌ను మూడోసారి సీఎం చేయాల్సిన బాధ్యత  ప్రజలదేనన్నారు.  మంత్రి అజయ్‌కుమార్‌‌ మాట్లాడుతూ..  పేదలకు గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో 3  వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఇస్తున్నామన్నారు.  జీవో 58 కింద ఒక్క రూపాయి తీసుకోకుండా పేదలకు పట్టాలు ఇస్తున్నామన్నారు.  పేదల కోసం రూ. 500 కోట్లు తన హయాంలో అభివృద్ధి జరిగిందన్నారు.   కేసీఆర్‌‌ను తనను మళ్లీ గెలిపించాలని కోరారు.  అంతకు ముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ రవిచంద్ర, మంత్రి అజయ్​ పూలమాల వేసి నివాళులర్పించారు.