- నల్గొండ కాంగ్రెస్‌లో ఫ్యామిలీ ప్యాకేజీ
- కొన్నేండ్ల నుంచి ఒకే కుటుంబానికి చెందిన లీడర్లకు టికెట్లు
- కోదాడ, హుజూర్‌నగర్‌లో ఎంపీ ఉత్తమ్ దంపతులు
- నల్గొండ, మునుగోడులో కోమటిరెడ్డి బ్రదర్స్
- తాజాగా నాగార్జునసాగర్‌లో జానా వారసుడు జయవీర్ రెడ్డి
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో ‘ఫ్యామిలీ ప్యాకేజీ’ రాజకీయాలపైన జోరుగా చర్చ జరుగుతున్నది. గత కొన్నేండ్ల నుంచి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు వరుస ఎన్నికల్లో సీట్లు లభించడం ఆసక్తికరంగా మారింది. ఈసారి కొత్తగా ఇంకొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక్కరే ఉన్నారని భావిస్తున్న తరుణంలో మళ్లీ ఆయన తమ్ముడు రాజగో పాల్ రెడ్డి సొంతగూటికి చేరారు. అలాగే, జానారెడ్డికి బదులు ఆయన రెండో కొడుకు జయవీర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
మొత్తంగా 12 అసెంబ్లీ స్థానాల్లో ఐదు కుటుంబాలకు చెందిన లీడర్లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడులో ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో ఆ యన భార్య పద్మావతి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి బరిలో ఉన్నాయి. వీరు ఐదు నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తున్నా.. మిగిలిన ఏడు నియోజకవర్గాల పైన వాళ్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడంలో సీనియర్లు సక్సెస్ అయ్యారు. సూర్యాపేట, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రేవంత్ అనుచరులకు టికెట్లు వస్తాయని భావించారు. కానీ, మునుగోడుపై కృష్ణారెడ్డి పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. సూర్యాపేట, తుంగుతుర్తి టికెట్లపై ఇంకా పంచాయితీ నడుస్తున్నది. ఎంపీలు ఉత్తమ్, వెంకటరెడ్డి అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు వారు ప్రతిపాదించిన వారికే టికెట్లు లభించాయి. బ్యాలెన్స్ మూడు స్థానాల్లోనూ ఎంపీలదే పైచేయిగా నిలిచే చాన్స్ ఉంది.
ఉమ్మడి జిల్లా పైన బ్రదర్స్ బ్రాండ్..
ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు చెబితేనే పార్టీ కేడర్‌లో జోష్ కనిపిస్తుంది. 2009 నుంచి వరుసగా 3 ఎన్నికల్లో బ్రదర్స్ కలిసే పోటీ చేశారు. ఇప్పుడు జరుగుతున్నది నాలుగో ఎన్నిక. 2018 ఎన్నికల తరహాలోనే బ్రదర్స్ ఈసారి కూడా పక్కపక్క సెగ్మెంట్లలోనే తలపడుతున్నారు. నల్గొండలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకున్న వెంకటరెడ్డి ఫస్ట్‌టైం 2018లో ఓడిపోయారు.
మరుసటి ఏడాది జరిగిన ఎంపీ ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలుపొందారు. రాజగోపాల్ రెడ్డి ఫస్ట్‌టైం 2009లో భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2014లో అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మునుగోడు నుంచి పోటీ చేసే చాన్స్ రావడంతో ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి.. ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గతేడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు సొంతగూటికి చేరుకున్న ఆయన ఎ మ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్లోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల పైన బ్రదర్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలోనూ బ్రదర్స్ సూచించిన వ్యక్తులకే అధిష్టానం టికెట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ దాదాపు అదేరకమైన వాతావరణం కనిపించింది.
సాగర్ ఎడమకాల్వ ఆయకట్టులో ఉత్తమ్ దంపతుల హవా..
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు ఏరియాలో ఉత్తమ్ దంపతుల రాజకీయ హవా నడుస్తుంది. 1999 నుంచి 2004 వరకు రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్.. 2009లో హుజూర్నగర్ షిఫ్ట్ అయ్యారు. 2009 నుంచి 2018 వరకు 3సార్లు హుజూర్నగర్ నుంచి గెలుపొందారు. 2019లో ఎంపీగా పోటీ చేయాల్సి రావడంతో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు.
ఢిల్లీ పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కలిసొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే చాన్స్ దక్కింది. ఆయన భార్య పద్మావతి తొలిసారిగా 2014లో కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓడిపోయిన ఆమె.. 2019లో హుజూర్నగర్ బైపోల్లో భర్త ప్లేస్‌లో పద్మావతి రెండోసారి పోటీకి దిగినా ఫలితం దక్కలేదు. మళ్లీ అవే ని యోజకవర్గాల నుంచి భార్యాభర్తలిద్దరూ పోటీలో నిలవడం గమనార్హం. ఎంపీగా ఉత్తమ్ ప్రభావం భువనగిరి, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల పైన బలంగా కనిపిస్తుంది.
జానారెడ్డి కొడుకు ఎంట్రీతో మారిన సాగర్ స్వరూపం..
రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎక్కువ శాఖల మంత్రిగా రికార్డు సృష్టించిన కుందూరు జానారెడ్డి తన కొడుకును రాజకీయ అరంగ్రేటం చేయించారు. తాను ప్రాతినిధ్యం వహించిన నాగార్జునసాగర్ నుంచి జయవీర్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్లు జానా ప్రకటించారు. అతడి గెలుపుకోసం ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ కేడర్‌లో ఉత్తేజం కలిగించేందుకు జానారెడ్డి ఎంపీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
ఇదిలావుంటే ఉమ్మడి జిల్లాలో 40 ఏండ్ల లోపు వయసు కలిగిన యువకులు పోటీ పడుతున్న ఏకైక నియోజకవర్గం నాగార్జునసాగర్. ఎమ్మెల్యే భగత్ నోముల నర్సింహయ్య కొడుకుగా బరిలో దిగితే, జయవీర్ జానారెడ్డి వారసుడిగా సాగర్‌లో ఫస్ట్‌టైం అడుగు పెట్టారు. ఈ ఇద్దరిలో సాగర్ ప్రజలు ఎవరికి పట్టం కడ్తారన్నది ఆసక్తికరంగా మారింది.