బీసీలకు 50% సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్
ప్రకటించిన పీసీసీ.. ఇతర పార్టీలు కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్
మహిళలు, దళితులపై దాడులకు నిరసనగా 7న ధర్నా
ఈ నెల 12న అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు దీక్షలు
కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో నిర్ణయాలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పీసీసీ ప్రకటించింది. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, దుబ్బాక ఎన్నికల గురించి చర్చించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేయాల్సిన పోరాటంపై సమాలోచనలు జరిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో యాభై శాతం సీట్లను బీసీలకు కేటాయించడంతోపాటు అన్ని పార్టీలు కూడా ఇదే విధంగా చేసేలా రాజకీయ, న్యాయ పోరాటాలు చేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది. గ్రేటర్ ఎన్నికల్లో 50 శాతం సీట్లను బీసీలకు కేటాయించడం సమంజసంగా ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను జానారెడ్డి, చిన్నారెడ్డి బలపరిచారు. దీనికి కోర్ కమిటీ ఆమోదం తెలపడంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు యాభై శాతం సీట్లు కేటాయించేలా పోరాటం చేయాలని నిర్ణయించారు.
మహిళలు, దళితులు, రైతుల కోసం ఆందోళనలు
రాష్ట్రంలో మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయాలని తీర్మానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ వ్యతిరేక విధానాలు అలంబిస్తున్నాయని, దీంతో రైతులు ఎన్నో కష్టాలు పడు తున్నారని కమిటీలో నేతలు చర్చించారు. రాష్ట్రంలో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం ఇచ్చే విషయాన్ని పట్టించుకోవడం లేదని, దీనిపై కాంగ్రెస్ కేడర్ పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 12న అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు దీక్షలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సన్నరకం వడ్లకు క్వింటాల్‌కు రూ. 2,500 ఇవ్వాలనే డిమాండ్‌తో ఉద్యమం నిర్వహించి రైతుకు మద్దతుగా నిలవాలన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలపై శాశ్వతంగా ఒక కమిటీని వేసి, దాని ఆధ్వర్యంలో అవసరాన్ని బట్టి వివిధ కార్యక్రమాలు రూపొందిస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించారు. త్వరలో నిర్ణయాన్ని ప్రకటించి, కమిటీ వేస్తామని ఉత్తమ్ చెప్పారు. దుబ్బాక ఎన్నికల్లో ప్రతి నేత, కార్యకర్త ఎంతో కష్టపడి పని చేశారని, వారందరికీ ఉత్తమ్, మాణిక్కం ఠాగూర్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోర్ కమిటీ భేటీ అనంతరం గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గాలపై సమీక్ష చేపట్టారు.
గ్రేటర్ అప్లికేషన్ ఫామ్ రూ. 10 వేలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వారు రూ. 10 వేలు పార్టీకి చెల్లించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. రిజర్వుడు సీట్లలో పోటీ చేయాలనుకునే వాళ్లు రూ. 5 వేల ఫీజు చెల్లించాలన్నారు. అప్లికేషన్‌తోపాటు చెక్ రూపంలో ఫీజు అందజేయాలని చెప్పారు.
విజయశాంతితో మాణిక్కం ఠాగూర్ భేటీ
పార్టీ మార్పు ప్రచారంతో ఆమె ఇంటికెళ్లి బుజ్జగింపు!
ప్రయారిటీ ఇస్తామని హామీ
కాంగ్రెస్ నేత విజయశాంతితో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ భేటీ అయ్యారు. బుధవారం స్వయంగా ఆమె ఇంటికెళ్లి కలిశారు. పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ఆమె ఠాగూర్‌కు వివరించారని తెలిసింది. రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, తన తెలంగాణ పర్యటనను అడ్డుకున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. విజయశాంతి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ, పార్టీలో యాక్టివ్‌గా లేరు. ఠాగూర్ ఇన్నిసార్లు రాష్ట్రానికి వచ్చినా, ఆయనను కలవలేదు. దుబ్బాక ప్రచారంలోనూ పాల్గొనలేదు. పైగా ఇటీవల విజయశాంతితో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు దక్షిణ తెలంగాణకు ఎంపీ రేవంత్ రెడ్డికి, ఉత్తర తెలంగాణకు తనకు పీసీసీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగిస్తే పార్టీని అధికారంలోకి తెస్తామని విజయశాంతి ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికితోడు విజయశాంతి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే విజయశాంతిని బుజ్జగించేందుకు ఠాగూర్ ఆమె ఇంటికి వెళ్లారని, పార్టీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం.
For More News..