మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 48 మందితో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 48 మందితో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. మిత్ర పక్షాలతో సీట్ల పంపకంపై క్లారిటీ రావడంతో గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను హస్తం పార్టీ గురువారం (అక్టోబర్ 24) విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్‎లో 45 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్ట్‎లో కీలక నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్లు కేటాయించింది. 

మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేను సకోలి సెగ్మెంట్ నుండి బరిలోకి దింపగా.. లెజిస్లేచర్ పార్టీ నాయకుడు బాలాసాహెబ్ థోరట్ సంగమ్‌నేర్ నుంచి, ప్రతిపక్ష నాయకుడు విజయ్ వాడెట్టివార్ బ్రహ్మపురి  స్థానం నుండి, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కరాడ్ సౌత్ నుంచి, సీడబ్ల్యూసీ సభ్యుడు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నసీం ఖాన్ చండీవాలి అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. కాగా, శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడి కూటమిగా ఏర్పడి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. 

ALSO READ | సుప్రీం కొత్త సీజేఐ సంజీవ్ ఖన్నా.. నవంబర్ 11న ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తలా 85 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్‎కు వచ్చిన 85 సీట్లగానూ గురువారం (అక్టోబర్ 24) 48 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మరో 37 సెగ్మెంట్లకు క్యాండిడేట్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. కాగా, నవంబర్ 20వ తేదీన 288 సీట్లకు సింగల్ ఫేజ్‎లో ఎన్నికలు జరగనుండగా.. 23న కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి.