
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తలా ఓ సీటుప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
- మరో సీటు మిత్రపక్షం సీపీఐకినేటితో ముగియనున్న ఎమ్మెల్యే కోటా
- ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. అద్దంకి దయాకర్ (ఎస్సీ), శంకర్ నాయక్ (ఎస్టీ), విజయశాంతి (బీసీ)కి అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఇందులో నాలుగు అధికార పార్టీ కాంగ్రెస్‌కు వచ్చే అవకాశం ఉంది. పొత్తుధర్మంలో భాగంగా ఒక సీటును మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది.
మరో మూడు సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ.. అద్దంకి, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో కొన్ని రోజులుగా పీసీసీలో సాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి దాదాపు పదేండ్లలో ఒకేసారి మూడు ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు సోమవారమే తుది గడువు కావడంతో.. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు.
ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో అద్దంకి దయాకర్ (తుంగతుర్తి), శంకర్ నాయక్ (మిర్యాలగూడ)లది ఉమ్మడి నల్గొండ జిల్లా కాగా, విజయశాంతిది వరంగల్ జిల్లా. దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరికి, ఉత్తర తెలంగాణ నుంచి ఒకరికి ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చినట్లయింది. ముగ్గురిలో ఒకరు ఎస్సీ, మరొకరు ఎస్టీ కాగా విజయశాంతి మాత్రం ఇటు బీసీ, పైగా మహిళా కోటా.
ముగ్గురి నేపథ్యం ఇదీ..!
శంకర్ నాయక్ :
మూడు దశబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉన్న నేత. ప్రస్తుతం నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన కోసం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సిఫారసు చేశారు. 1998లో దామెరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శంకర్ నాయక్.. జెడ్పీటీసీగా, ఎంపీపీగా, నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.
అద్దంకి దయాకర్ :
2014 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యకారుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తుంగతుర్తి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన.. నిత్యం ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. బీఆర్ఎస్, బీజేపీ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. 2024 జనవరిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయన పేరును హైకమాండ్ ప్రకటించి, ఆ తర్వాత కొన్ని కారణాలతో వెనక్కి తీసుకుంది. అయినా ఆయన పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. అద్దంకి దయాకర్ పేరును సీఎం రేవంత్ రెడ్డి సిఫారసు చేయగా.. హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంది.
విజయశాంతి :
అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్ గెలుపు కోసం చురుకుగా పనిచేసిన విజయశాంతి.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ, అప్పుడప్పుడు ట్వీట్లతో ప్రతిపక్షాలకు చురకలంటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేవలం మూడు రోజుల ముందు నుంచే ఈమె పేరు ఎమ్మెల్సీ రేసులోకి వచ్చింది. రాష్ట్ర నేతలకు సంబంధం లేకుండా నేరుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేనే చొరవ తీసుకొని విజయశాంతి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విజయశాంతి పోరాటం చేశారు. ఆ తర్వాత తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచి.. తెలంగాణ కోసం తన గొంతును వినిపించారు.
2014లో ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. 2020 డిసెంబర్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. అనంతరం 2023 నవంబర్‌లో బీజేపీకి గుడ్ బై చెప్పి మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో ఖర్గే నుంచి విజయశాంతికి స్పష్టమైన హామీ ఉన్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో ఖర్గేనే కీలకంగా వ్యవహరించినట్లు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
నేడు నామినేషన్లు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లకు సోమవారం చివరి తేదీ కావడంతో.. ఈ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ముగ్గురితో పాటు సీపీఐ అభ్యర్థి నలుగురు కలిసి నామినేషన్లు వేస్తారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ హైకమాండ్ అన్ని కోణాల్లో ఆలోచించే అభ్యర్థులను ఎంపిక చేసిందని, అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసిందన్నారు.
భారీ కసరత్తు తర్వాత..!
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీలో భారీ కసరత్తే జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫైవ్ మెంబర్ కమిటీ సభ్యులైన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పలు దఫాలు ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. చివరికి బడుగు, బలహీన వర్గాలకే అవకాశం ఇవ్వాలని.. అందులో పార్టీ విధేయులకే పట్టం కట్టాలని నిర్ణయించారు.
అభ్యర్థులుగా ఎంపికైన అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్, విజయశాంతి.. ఈ ముగ్గురు కూడా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డారు. శంకర్ నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే టికెట్ ను, అద్దంకి దయాకర్ తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ను, విజయశాంతి మెదక్ ఎంపీ టికెట్ ను ఆశించారు. అయితే వీరికి అప్పట్లో టికెట్లు ఇవ్వకపోయినా.. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి, పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా వారికి హైకమాండ్ చాన్స్ ఇచ్చింది.
పొత్తు ధర్మంతో సీపీఐకి ఒకటి
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీతో పాటు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మిత్రపక్షం సీపీఐకి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని హామీ ఇచ్చింది. పొత్తు ధర్మంలో భాగంగా మిత్రపక్షానికి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చింది.
త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నందున సీపీఐతో కలిసి పోటీ చేస్తే ఎక్కువ స్థాయిలో లోకల్ సీట్లను దక్కించుకోవచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ సీటును సీపీఐకి ఇవ్వడంతో లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు లైన్ క్లియర్ అయింది.