సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తమ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. ఇటీవల కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 6వ తేదీ శనివారం కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణన్ శ్రీ గణేష్ పోటీ చేయబోతున్నట్లు ఏఐసీసీ వెల్లడించింది. ఇటీవల గణేష్.. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున దివంగత గద్దర్ కూతురు వెన్నెల.. లాస్య నందితపై పోటీ చేసి ఓడిపోయారు.ఈ ఉప ఎన్నికకు అధికార పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించిన క్రమంలో బీఆర్ఎస్.. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే టికెట్ ఇస్తుందా? లేక బయటివారిని బరిలో దింపుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.