న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మూడో లిస్టును కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 సీట్లకు క్యాండిడేట్ల పేర్లను ఇందులో ప్రకటించింది. తెలంగాణ నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు టికెట్ కన్ఫామ్ చేసింది. అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి టికెట్‌ను పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి, సికింద్రాబాద్ టికెట్‌ను దానం నాగేందర్‌కు ఓకే చేసింది. చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఈ నెల 8న ప్రకటించిన లిస్టులో 4 సీట్లకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి మనుమడు గడ్డం వంశీకృష్ణ. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులకు ఆయన పెద్ద కుమారుడు. తాత, తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో ప్రవేశించిన వంశీకృష్ణ.. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. నాలుగు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి వివేక్‌వెంకటస్వామి విజయం సాధించడంలో గడ్డం వంశీకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో కేడర్‌ను సమీకరించడంలో, ప్రచార వ్యూహాలు రచించి, అమలుచేయడంలో సక్సెస్ అయ్యి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పడ్డారు. విశాక ఇండస్ట్రీస్ జేఎండీగా ఉన్న గడ్డం వంశీకృష్ణ.. యువ ఆవిష్కర్తగా, బిల్డింగ్ మెటీరియల్ప్రొవైడర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
2011లో విశాక ఇండస్ట్రీలో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరి, 2012 నాటికే ప్రధాన వ్యాపార వ్యూహకర్తగా ఎదిగారు. 2014 నుంచి 2017 వరకు డైరెక్టర్‌గా, ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో ఇన్నోవేషన్స్ తో ప్రజల ముందుకు వచ్చారు. వీ నెక్ట్స్, ఆటం, సోలార్ రూప్ లాంటి ఆవిష్కరణలకు ఇండియాతో పాటు విదేశాల్లో పేటెంట్ పొందారు. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూనే వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. సామాజిక సేవరంగంలోనూ గడ్డం వంశీకృష్ణ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో విశాక ఇండస్ట్రీస్తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఆదరణ పొందారు. తాజాగా రాజకీయాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైన ఆయనకు టికెట్ దక్కడంతో కాకా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.