న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూటమిలోని పార్టీలకు తలొగ్గి మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయలేదని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్యసభలో సోమవారం ప్రత్యేక చర్చ జరిగింది. అధికార పక్షం తరఫున నిర్మలా సీతారామన్చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తమ కుటుంబం, వారసుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చేసిందని ఆరోపించారు. 42వ రాజ్యాంగ సవరణ, షా బానో కేసుసహా కాంగ్రెస్‌చేసిన సవరణలేవీ దేశానికి ఉపయోగపడలేదని అన్నారు. వారు చేసిన రాజ్యాంగ సవరణలు వారి కుటుంబానికి మాత్రమే ఉపయోగపడ్డాయని ఎద్దేవా చేశారు.
వాక్ స్వాతంత్ర్య హక్కును కాంగ్రెస్ కాలరాసింది
కాంగ్రెస్ పార్టీ తన హయాంలో దేశంలో వాక్ స్వాతంత్ర్య హక్కును కాలరాసిందని నిర్మలా సీతారామన్అన్నారు. 1949లో మజ్రూ సుల్తాన్‌పురి, యాక్టర్బాల్రాజ్సాహ్నీ నిర్బంధం, ఇందిరాగాంధీ, ఆమె కొడుకు రాజీవ్‌గాంధీని ప్రశ్నించినందుకు ‘కిస్సా కుర్చీ కా’ సినిమాపై నిషేధం గురించి ప్రస్తావించారు. చాలా దేశాలు తమ రాజ్యాంగం అసలు ఉద్దేశాన్ని మార్చివేసినా.. భారత రాజ్యాంగం మాత్రం కాలపరీక్షలను తట్టుకొని నిలబడిందని చెప్పారు. వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ రాజ్యాంగానికి సవరణలు చేసిందని, ఇప్పుడు మాత్రం రాజ్యాంగ పరిరక్షణ గురించి లెక్చర్స్ ఇస్తున్నదని మండిపడ్డారు. 50 ఏండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయలేదని తెలిపారు.