హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం అనేక వ్యూహాలతో ఓట్ల యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డికి ట్రబుల్ షూటర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం ఆయన నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ఆశావహుల నుంచి పీసీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. పలు సెగ్మెంట్లలో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
సామాజిక సమీకరణాలు, రకరకాల డిమాండ్లు తెరపైకి రావడంతో స్క్రీనింగ్ కమిటీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జాబితాలు స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు అప్పటికప్పుడు తలెత్తిన సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ట్రబుల్ షూటర్ గా మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలో కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ ఆశావహుల మధ్య సయోధ్య కుదిర్చి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేసేలా చర్చలు జరపనుంది. ఇందుకోసం వారికి రకరకాల గ్యారెంటీలను ఇవ్వనుందని సమాచారం. ఈ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరగనుంది. అంటే దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిన జాబితా ఆధారంగానే జానారెడ్డి కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉందని సమాచారం.
ALSO READ : సారొస్తారొస్తారు!.. కేసీఆర్ పైనే గులాబీ అభ్యర్థుల ఆశలు
రెబల్స్ కు కట్టడి
జానారెడ్డి నేతృత్వంలోని ఫోర్ మెన్ కమిటీపై తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగకుండా చూసే బాధ్యతను ఏఐసీసీ ఉంచింది. వారికి ఎంపీ సీట్లలోఅవకాశం కల్పిస్తామని, ఎమ్మెల్సీలుగా చాన్స్ ఇస్తామని, నామినేటెడ్ పదవులు కట్టబెడతామని వివిధ రకాల హామీలను తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉండకుండా చూస్తుందని సమాచారం.