- పదేండ్లకు పదవులు రావడంతో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్
- మిగతా నామినేటేడ్పోస్టులపై లీడర్ల ఫోకస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం పాలకవర్గాలను నియమించడంతో కాంగ్రెస్ సెకండ్ క్యాడర్‌లో జోష్ నెలకొంది. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగా తాజా నియామకాలతో మిగతా పోస్టులకు భారీగా ఆశావహులు పోటీపడుతున్నారు.
ఈ పదేండ్లలో పార్టీకి విధేయులుగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేసినవారికే పదవులు దక్కడంతో క్యాడర్‌లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని చాలా ఏఎంసీలకు పాలకవర్గాలను ప్రభుత్వం ప్రకటించగా... ఒక్క రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే 5 ఏఎంసీలు కొలువుదీరాయి. మరో వారంలో వేములవాడ నియోజకవర్గంలోని ఏఎంసీలకు పాలకవర్గాలను ప్రకటించే అవకాశముండడంతో నేతల వద్దకు ఆశావహులు క్యూ కడుతున్నారు.
సిరిసిల్లలో ఐదు ఏఎంసీలకు నియామకాలు
సిరిసిల్ల నియోజకవర్గంలోని ఐదు ఏఎంసీలకు పాలకవర్గాలను రెండు రోజుల కింద ప్రభుత్వం ప్రకటించింది. గంభీరావుపేట ఏఎంసీ చైర్‌పర్సన్‌గా కొమిరిశెట్టి విజయ, వీర్నపల్లి ఏఎంసీ చైర్మన్ గా లకావత్ రాములు, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఏఎంసీకి షేక్ సాబేరా బేగం, సిరిసిల్లకు వెల్ముల స్వరూప, ముస్తాబాద్ మండలం పోతుగల్ ఏఎంసీకి తలారి రాణి నియమితులయ్యారు.
కాగా జిల్లాలో ఇంకా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారన్న ప్రచారంతో ఆశావహులు నేతల వద్దకు క్యూ కడుతున్నారు. పదవులు పొందేందుకు ముఖ్యంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి వద్దకు వెళ్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.